125 కిలోల బంగారంతో యాదాద్రి విమాన గోపురాన్ని బంగారం తాపడం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ బంగారాన్ని వీలైనంత వరకూ విరాళాల ద్వారా సేకరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నామన్న సంతృప్తి భక్తులకు కలిగించడమే దీని ఉద్దేశం. అందుకే ఈ పవిత్ర కార్యానికి తొలి విరాళంగా కేసీఆర్ కుటుంబం తరఫున ఒక కిలో 16 తులాల బంగారం ఇస్తామని నిన్న యాదాద్రిలో ప్రకటించారు.


సీఎం కేసీఆర్ తన వంతు విరాళం ప్రకటించిన తర్వాత అనేక మంది బంగారం విరాళం ఇస్తామని ముందుకొస్తున్నారు. చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారని సీఎం కేసీఆరే ప్రకటించారు. చినజీయర్‌ స్వామి పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారట. అలాగే  మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరఫున కిలో, మేడ్చల్‌ నియోజకవర్గ ప్రజల తరఫున కిలో ఇస్తామని ప్రకటించారు. అంటే రెండు కేజీలన్నమాట. అలాగే.. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి తన రెండు వస్త్ర సంస్థల తరఫున రెండు కిలోలు ఇస్తామని కేసీఆర్‌కు చెప్పారట.


కావేరి సీడ్స్‌ అధినేత భాస్కర్‌రావు తాను కూడా కిలో బంగారం ఇస్తామని.. అలాగే నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్‌రావు కిలో బంగారం ఇస్తామని కేసీఆర్‌తో చెప్పారట. వీరే కాదు.. ఇలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నారని కేసీఆర్ ప్రకటించారు. దీంతో యాదాద్రి విమన గోపురానికి భారీగా బంగారం విరాళాలు లభించినట్టయింది. కేసీఆర్ ప్రకటనతో తొలి రోజే 22 కిలోలు బంగారం విరాళాల ప్రకటనలు వచ్చాయి.


కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత మరికొందరు విరాళాలు ప్రకటించారు. హెటెరో సంస్థ 5 కిలోల బంగారం దానం ఇస్తామని ప్రకటించింది. అలాగే మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా కిలో చొప్పున బంగారం ఇస్తామని చెప్పారు. ఇలా ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా సమకూరినట్టు తేలుతోంది. స్వామివారి కార్యంలో పాలుపంచుకోవడం భక్తులకు కూడా ఆనందదాయకమేగా..!

మరింత సమాచారం తెలుసుకోండి: