ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా జంప్ జిలానీలదే రాజ్యం నడుస్తోంది. గతంలో తాము ప్రాతినిధ్యం వహించే పార్టీ గెలిచినా, ఓడినా కూడా... నేతలు అదే పార్టీలో కొనసాగే వాళ్లు. అలాగే తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసేవాళ్లు. పార్టీ ప్రతిపక్షంలో ఉంటే... అధికారంలోకి వచ్చే వరకు ఎదురు చూసే వాళ్లు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసే వాళ్లు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. తమ పార్టీ ఓడితే చాలు.. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండే ఓపిక లేకుండా పోయింది చాలా మంది నేతలకు. కొంతమంది ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జెండా మారుస్తున్నారు. మరి కొందరేమో... కొద్ది రోజుల పాటు ఎదురు చూసి మారిపోతున్నారు. ఇంకొందరు మాత్రం వ్యాపార అవసరాల కోసం అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఏ పార్టీ గెలిచినా సరే... ప్రతిపక్షం నుంచి నేతలు వచ్చేసి చేరి పోతున్నారు. దీనిని ప్రతిపక్ష నేతలు స్వార్థ ప్రయోజనాలు అని అంటుండగా... అధికార పార్టీ నేతలేమో... తమ నేత పరిపాలన పట్ల ఆకర్షితులై వచ్చేస్తున్నారని అంటున్నారు.

పార్టీ మారిన నేతలదే ప్రస్తుతం హవా నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. అటు తెలుగుదేశం పార్టీలో అయినా... ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా సరే... పార్టీ మారితే చాలు... పదవి గ్యారంటీ. గతంలో టీడీపీలోకి మొత్తం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. అందులో నలుగురు మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. ఇక నామినేటెడ్ పదవులు కూడా పెద్ద ఎత్తునే పొందారు వలస నేతలు. ఇప్పుడు వైసీపీలో కూడా సేమ్ సీన్ నడుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి గెలిచిన నేతలు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. అందులో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అమాత్యులుగా ఉన్నారు. ఇక ఎన్నికల అనంతరం జగన్ పరిపాలనకు జై కొట్టిన నేతల్లో ఇద్దరు శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వర ప్రసాద్‌లు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరిద్దరు కూడా పదవిపై గ్యారంటీతోనే పార్టీ మారినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp