హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ బాస్ లో చాలా మార్పులు వచ్చినట్టు కనబడుతోంది. ఓటమి తర్వాత పార్టీ వ్యవహారాలు నేతల తీరు తదితర అంశాలపై దృష్టి పెడుతున్న అధినేత ముందుగా మన ఇంటిని సరిచేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇంటికి సరి చేయాలంటే కీలక నేతలు సీనియర్ నాయకులు అసంతృప్తి లేకుండా చూడాలి. అందులో భాగంగానే గులాబీ అధినేత ఇటీవల ఎమ్మెల్సీ పదవుల కీలక నేతలకు, సీనియర్ నేతలకు కట్టబెట్టారు. అంతేకాకుండా వీరిలో కొందరికి మరింతగా ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలో సైతం చోటు కల్పించనున్నట్లు గులాబీలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

 ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న ఓ ఇద్దరు సీనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి పార్టీని మరింత బలోపేతం చేసి నాయకులను గాడిలో పెట్టే 2023 వరకు మరింత బలంగా మారాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతకాదన్నా తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా బిజెపి పైన అధినేత ఫోకస్  అంతా పెట్టినట్టు కనబడుతోంది. గతంలో అసలు మాకు బిజెపి పోటీ లేదని చెప్పిన కేసీఆర్ కమలం  ఎఫెక్టుతో ఇప్పుడు  తెరాస పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు కనబడుతోంది. చాపకింద నీరులా బీజేపీ పాకుతోంది అని గులాబీ అధినేత భావించి దిద్దుబాటు చర్యలు కాస్త వేగంగా నమోదు చేసినట్టు గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క నామినేటెడ్ పదవిని త్వరగా భర్తీ చేసిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని గులాబీ శ్రేణులు సైతం బహిరంగంగానే ఒప్పుకుంటారు. దీని వల్ల నామినేటెడ్ పై కాస్తోకూస్తో ఆశలు పెట్టుకున్న వారిలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతున్నట్టు అధినేత సైతం గుర్తించినట్లు తెలిసింది.

ముఖ్యంగా బిజెపి పార్టీలోకి వలసలు పోకుండా నివారించడానికి త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసి నాయకుల్లో అసంతృప్తిని పోగొట్టాలని కెసిఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న వారి పనితీరు సైతం తెలుసుకుని పనితీరు సరిగ్గా లేని వారికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కెసిఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తే మొత్తానికి గులాబి పై కమలం ఎఫెక్ట్ బాగానే పడినట్లు తెలుస్తున్నది.  ఇదంతా ఎలా ఉన్న గులాబీ నేతలు ఇలాంటి నిర్ణయాలతో తెరాస లో కొత్త ఉత్సాహం పెరిగిందని కార్యకర్తలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: