త‌మ రాజ‌కీయ జైత్ర‌యాత్ర‌లో భాగంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌నూ ఒక్కొక్క‌టిగా సొంతం చేసుకోవాల‌ని భావించిన బీజేపీకి ఆ ఆశ‌లు అనుకున్నంత సులువుగా నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల దిశ‌ద‌శ‌ల‌ను నిర్దేశించ‌నున్నాయ‌న్న అభిప్రాయం ఉండ‌టంతో ఆ రాష్ట్రంలో ఎలాగైనా గెల‌వాల‌ని బీజేపీ వ్యూహాలు ప‌న్నుతోంది. మ‌రోప‌క్క ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈ సారి బీజేపీకి లోక్‌స‌భ సీట్లు భారీగా త‌గ్గ‌నున్నాయ‌న్న అంచ‌నాలుండ‌టంతో ఆలోటును ద‌క్షిణాది నుంచి పూడ్చుకోవాల‌ని బీజేపీ అధినాయ‌క‌త్వం ఆలోచిస్తోంది. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు సాధ్య‌మ‌న్న‌దే ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల‌కు సైతం అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌గా మారింది.  త‌మిళనాట జ‌య‌ల‌లిత మ‌ర‌ణం తరువాత అన్నాడీఎంకే ప్ర‌భుత్వాన్ని త‌మ గుప్పిట్లో పెట్టుకుని మోదీషాలు త‌మ‌ రాజ‌కీయ వ్యూహాలను అమ‌లు చేశారు. అయితే త‌మిళ తంబీలు ద్ర‌విడ పార్టీల‌నే త‌ప్ప‌ ఉత్త‌రాది పార్టీల ఆధిప‌త్యాన్ని ఎన్న‌టికీ అంగీక‌రించ‌ర‌ని అక్క‌డ‌ డీఎంకే గెలుపు వారికి తెలియ‌జెప్పింది. కాగా బెంగాల్‌లో ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకుంటామ‌ని ఆ పార్టీ పెట్టుకున్న ఆశ‌ల‌ను మ‌మ‌తా బెన‌ర్జీ మొగ్గ‌లోనే తుంచేయ‌డ‌మే కాదు. అస‌లు త‌న ల‌క్ష్యం ఢిల్లీ పీఠ‌మేన‌న్న స్థాయిలో చెల‌రేగిపోతున్నారు.
       
          ఇక దేశంలోనే అత్య‌ధిక అక్ష‌రాస్య‌త క‌లిగిన కేర‌ళ‌లో బీజేపీ అనుస‌రించిన మ‌త త‌త్వ‌ రాజ‌కీయాలను అక్క‌డి ప్ర‌జ‌లు స్ప‌ష్టంగానే తిప్పికొట్టారు. ఇప్ప‌టిదాకా ప‌లు ర‌కాల వ్యూహాల‌తో ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ క‌ర్నాట‌క‌లోనూ ఈసారి కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగా బ‌ల‌ప‌డిన‌ట్టు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తుండ‌టం బీజేపీకి నిజంగా చేదువార్తేన‌ని చెప్పాలి. కాషాయ పార్టీ  కాస్త ఎక్కువ‌గానే ఆశ‌లు పెట్టుకున్న మ‌రో రాష్ట్రం తెలంగాణ‌. ఇక్క‌డ కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యాన్ని ఏమేర‌కు అడ్డుకుని ఫ‌లితాలు సాధించ‌గ‌ల‌దో వేచి చూడాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే ద‌క్షిణాదిన కూడా సొంతంగా జెండా ఎగుర‌వేయాల‌న్నవ్యూహం నుంచి బీజేపీ ప‌క్క‌కు మ‌ర‌లి మ‌రోసారి ప్రాంతీయ పార్టీల‌తో పొత్తుల‌కు సిద్ధం కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: