రిజర్వేషన్ అంశంపై చంద్రబాబునాయుడు చాలా అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించే 2019లో ఘోరంగా దెబ్బతిన్నారు. అయినా జ్ఞానోదయం అయినట్లు లేదు. ఎందుకంటే ఇఫుడు కూడా అదే డిమాండ్ ను రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కాపులను బీసీల్లోకి చేర్చే విషయంలో టీడీపీ కట్టుబడుందని టీడీపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఓడీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5 శాతాన్ని కాపులకు కేటాయించటాన్ని గుర్తుచేస్తున్నారు.
ఇక్కడ చంద్రబాబు అయినా టీడీపీ నేతలైనా మరచిపోతున్న విషయం ఒకటుంది. అదేమిటంటే కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించటాన్ని బీసీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాపులను బీసీల్లో కలిపితే తమకు అందుతున్న రిజర్వేషన్లు తగ్గిపోతాయని బీసీలు ఆందోళన చేస్తున్నారు. ఇందులో నూరుశాతం వాస్తవముంది. ఏ సామాజికవర్గం మాత్రం తమకు అందుతున్న రిజర్వేషన్ ఫలాలను వదులుకోవటానికో లేకపోతే ఇతరులతో పంచుకోవటానికో ఇష్టపడుతుంది ?
ఇంతచిన్న లాజిక్ ను మరచిపోయే చంద్రబాబు బీసీలను దూరం చేసుకున్నారు. దశాబ్దాల పాటు టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు మొదటిసారి వైసీపీ వైపు మొగ్గుచూపారు. కారణం ఏమిటంటే కాపులను బీసీల్లో చేర్చటం సాధ్యంకాదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేయటమే. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగినట్లులేదు. కాపులను బీసీల్లో కలిపేందుకు చంద్రబాబు ఆలోచనను బీసీ సామాజికవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయటం కోసమే తొందరలోనే వైసీపీ ఆధ్వర్యంలో సదస్సులు జరగబోతున్నాయి.
హోలు మొత్తంమీద చూస్తే చంద్రబాబు అనాలోచిత డిమాండ్ తో జగన్ కు మేలు చేస్తున్నట్లున్నారు. ఇంకా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న బీసీలు కూడా తొందరలోనే వైసీపీ వైపు వెళిపోవటం ఖాయమనిపిస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబుకు ఎంతమంది పవన్ కల్యాణ్ లు మద్దతుగా నిలిచినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే సమాజంలో బీసీలే 50 శాతంకు పైగా ఉన్నారు. వీళ్ళకు తోడు ఎస్సీలు, ఎస్టీలు మైనారిటీలు జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. కాబట్టి చంద్రబాబు+పవన్ కలిసినా తనకు వచ్చే నష్టం ఏమీలేదని జగన్ ధీమాతో ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి