పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే దుల్హన్ పథకం తిరిగి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు కేబినెట్ మీటింగ్ కి ముందు సీఎం జగన్ మంత్రుల వద్ద చూచాయగా ఈ ప్రస్తావన చేసినట్టు సమాచారం. దుల్హన్ పథకం ఆగిపోయిందంటూ ఇటీవల కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు, అసలు పథకం అమలులో ఉందా లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిధులు లేకపోవడంతో పథకం ఆపేశామన్నది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దుల్హన్ పథకం ఆపేయడంతో వైసీపీపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పథకాన్ని ఆపేసింది తాము కాదని, చంద్రబాబు హయాంలోనే ఆపేశారంటున్నారు అధికార పార్టీ నేతలు. పాత లెక్కలు బయటకు తీస్తున్నారు. అయితే త్వరలోనే ఆర్థిక సాయాన్ని 50వేలనుంచి లక్ష రూపాయలకు పెంచి దుల్హన్ ని అమలు చేయాలనుకుంటున్నారట సీఎం జగన్.

పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం ఇచ్చేందుకు రూపొందించిన దుల్హన్‌ పథకాన్ని ఒక మంచి రోజు చూసుకుని పునఃప్రారంభిద్దామని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీనితోపాటు.. విదేశీ విద్య, విద్యాదీవెన లాంటి పథకాలను కూడా సంతృప్త స్థాయిలో అమలు చేసేలా ప్రశాణిల రచించాలని ఆయన అధికారులు, మంత్రులకు ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు. కేబినెట్ మీటింగ్ లో అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత ఆయన ఈ ప్రతిపాదన చేశారట.

దుల్హన్ ని ఆపేసింది టీడీపీయే..
దుల్హన్‌ పేరుతో పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే పథకాన్ని టీడీపీ తీసుకొచ్చినా.. 2017, 18 కాలంలో వారే ఈ పథకాన్ని ఆపేశారని, నిధులు విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టారని సీఎం మంత్రులకు వివరించారట. అయితే ఇప్పుడు కొత్తగా వైసీపీ ఆ పథకాన్ని ఆపేసిందనే విషయాన్ని తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నరని చెప్పారట. ఈ విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని, దుల్హన్ కి నిధులివ్వకుండా చంద్రబాబు తప్పు చేస్తే, దాన్ని సరిదిద్దడానికి తమ ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పాలన్నారట. త్వరలో దుల్హన్ ని తిరిగి ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: