ముక్కుసూటిగా మాట్లాడతాను అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ.. ఆ పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, నిత్యం వార్తల్లో ఉండటం.. చేస్తుంటారు. ఇటీవల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై ఆయన సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా వైరల్ గా మారాయి. కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా ఆయన కించపరిచే వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఆయనకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కేసు పెట్టారు. ఇప్పుడాయనపై ఏపీ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఆయనకు నోటీసులిస్తామని హెచ్చరించారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తి గా నిలిచే రామ్ గోపాల్ వర్మపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము పై వర్మ సోషల్ మీడియాలో అనుచిత వాఖ్యలు చేయటం దురదృష్టకరమని అన్నారు వాసిరెడ్డి పద్మ. ఆయన వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ద్రౌపదీ ముర్ముకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ సినిమా రంగంలో పనిచేసే వ్యక్తి అని, ఆయనలాంటి వారు చేసే కామెంట్స్ సమాజంపై ప్రభావం చూపుతాయని అభిప్రాయ పడ్డారు వాసిరెడ్డి పద్మ. గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వస్తే.. అభినందించాల్సింది పోయి, ఇలా కించపరిచేలా మాట్లాడటం తగదని ఆమె వర్మకు హితవు పలికారు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని.. ప్రజాభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలని వర్మకు సూచించారు వాసిరెడ్డి పద్మ.

ద్రౌపదీ ముర్మ పేరు ప్రకటించిన వెంటనే రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మహాభారత ఘట్టాన్ని తీసుకొచ్చి.. పాండవులు, కౌరవులు అంటూ వివావదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై చాలామంది వ్యతిరేకంగా స్పందించారు. కనీసం రాష్ట్రపతి పదవికి అయినా, ఆ పదవికి పోటీ చేసే వ్యక్తులకయినా వర్మ గౌరవం ఇవ్వాల్సిందన్నారు. అందులోనూ ఓ మహిళపై అలా కామెంట్లు చేయడం తగదన్నారు. దీనిపై వర్మనుంచి రియాక్షన్ రాలేదు, సరికదా.. తన వ్యాఖ్యల్ని తాను సమర్థించుకుంటూ మరోసారి పోస్టింగ్ లు పెట్టారు. దీంతో అటు తెలంగాణలో బీజేపీ నేతలు కేసు పెట్టారు, ఇటు ఏపీలో మహిళా కమిషన్ నోటీసులిస్తామని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: