ప్రతి ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అనేది సాధారణమే. ఘర్షణలు లేని సంసార జీవితం లేదని చెప్పవచ్చు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. చూసీచూడనట్లు వదిలేయాలి. కానీ వాటి గురించే ఆలోచిస్తూ ఉండకూడదు.ఎందుకంటే ఇది భార్యభర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చెడగొడుతుంది. అయితే.. తెలిసో తెలియక చేసే చిన్న చిన్న పనులు.. ఆవేశపూరిత నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముంబయిలో ఇలాంటి ఘటనే జరిగింది. షాపింగ్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు.ఇక అంతటితో ఆగకుండా ఆమెను భయపెట్టేందుకు ఫ్యాన్ కు ఉరి వేసుకుంటున్నట్లు నటించాలనుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తు ఉరికంబానికి చిక్కి విలవిల్లాడాడు. స్థానికులు గమనించి, ఆస్పత్రికి తరలించే లోగా ప్రాణాలు కోల్పోయాడు. ముంబయి మహా నగరంలోని విరార్ వెస్ట్‌ వీర్ సావర్కర్ మార్గ్‌లో శర్మ అనే వ్యక్తి తన భార్య చాందినీదేవి తో కలిసి నివాసముండేవాడు. శర్మ ఓ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో పనిచేస్తున్నాడు.


ఈ క్రమంలో షాపింగ్ కోసం చాందినీ భర్త నుంచి రూ.2000 అడిగింది. అంత డబ్బు అవసరం లేదని.. రూ.1500 తీసుకుని మిగతా రూ.500 తిరిగివ్వాలని చెప్పాడు. సరేనన్న చాందినీ భర్తకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు.ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ పెరిగి పెద్దదైంది. రూ.500 ఇవ్వాల్సిందేనని శర్మ పట్టుబట్టాడు. భార్యను బెదిరించేందుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంటున్నట్లు భయపెట్టాలని భావించాడు. తన బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు. గదిలోని ఫ్యాన్ కు క్లాత్ కట్టాడు. ఇదంతా భార్య గమనిస్తూనే ఉంది. భర్త కూడా ఆమెను భయపెట్టాలనే అనుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తు అతను వేసుకుని ఉరి మెడకు బిగుసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన చాందినీ.. గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కలా ఉన్నవారికి సమాచారం అందించింది.వారు వెంటనే అలర్ట్ అయ్యి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న శర్మను కిందికి దించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అతనిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: