
ముందు ఏసీబీ కోర్టు తర్వాత హైకోర్టులో పిటీషన్లు వేసిన చంద్రబాబునాయుడు తరపున లాయర్లు ఓడిపోయారు. స్కిల్ స్కామ్ దర్యాప్తు ప్రధామికదశలోనే ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వటం సాధ్యంకాదని హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది. సుప్రింకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే తాము చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటంలేదని కూడా తీర్పులో హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పైగా 17ఏ సెక్షన్ ఏ కోణంలో చూసుకున్నా చంద్రబాబుకు వర్తించదని కూడా తేల్చేసింది. దాంతో చంద్రబాబు లాయర్లు సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయటానికి రెడీ అవుతున్నారు.
ఈ నేపధ్యంలోనే సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే ఏమవుతుంది అనే ఆసక్తి పెరిగిపోతోంది. న్యాయనిపుణుల ప్రకారం సుప్రింకోర్టులో కూడా ఏమీకాదట. ఎందుకంటే రు. 371 కోట్ల అవినీతిలో చంద్రబాబు పాత్రుందని ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు కూడా నిర్ధారణకు వచ్చాయి. జరిగిన అవినీతిలో చంద్రబాబు పాత్ర ఎంతుందనే విషయాన్ని సీఐడీ పూర్తిస్ధాయిలో విచారణ చేస్తేకానీ తెలీదు. అందుకనే చంద్రబాబును విచారించేందుకు ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడిగింది. అందుకు ఏకీభవించిన ఏసీబీ కోర్టు రెండురోజుల కస్టడీకి ఇచ్చింది.
అంటే జరిగిన అవినీతిలో చంద్రబాబు పాత్రుందని ఏసీబీ కోర్టు, హైకోర్టు నిర్ధారించిన తర్వాత సుప్రింకోర్టు భిన్నంగా నడుచుకునే అవకాశం లేదని ప్రముఖ లాయర్ విష్ణువర్ధనరెడ్డి అన్నారు. కేసు విచారణ మొదలుపెట్టేముందే కిందిస్ధాయి కోర్టులిచ్చిన తీర్పును సుప్రింకోర్టు పరిశీలిస్తుందని చెప్పారు. ఆర్ధికనేరాల దర్యాప్తు సందర్భంగా ప్రాధమిక దశలో బెయిల్ ఇవ్వకూడదని గతంలో సుప్రింకోర్టు ఇఛ్చిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని కూడా మరి కొందరు లాయర్లు అంటున్నారు.
బెయిల్ ఇప్పించేందుకు చంద్రబాబు లాయర్లు చేసిన వాదనలు రెండు కోర్టుల్లోను వీగిపోయిన నేపధ్యంలో సుప్రింకోర్టులో ఊరట లభించే అవకాశాలు లేవనే అభిప్రాయపడుతున్నారు. సుప్రింకోర్టులో కూడా కేసు వీగిపోతే మళ్ళీ కేసు వేయటానికి ఆరుమాసాలు ఆగాల్సుంటుందట. అందుకనే చంద్రబాబు మరో ఆరుమాసాల పాటు రాజమండ్రి జైలులోనే ఉండాల్సుంటుందని కొందరు లాయర్లు గట్టిగా చెబుతున్నారు. స్కామ్ లో తన పాత్రలేదని చంద్రబాబు వాదన వినిపిస్తున్నారు. అయితే స్కామ్ లో చంద్రబాబే సూత్రదారని సీఐడీ స్పష్టమైన ఆధారాలను చూపిస్తోందని అన్నారు. సీఐడీ వాదనతో ఏకీభవించిన కారణంగానే రెండు కోర్టుల్లో చంద్రబాబు లాయర్ల వాదనలు వీగిపోయినట్లు అభిప్రాయపడ్డారు. మరి సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.