తెలుగుదేశంపార్టీకి మంత్రి కేటీయార్ పెద్ద షాకిచ్చారు. చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా తెలంగాణాలో ర్యాలీలు, నిరసనలు చేస్తామంటే ఒప్పుకునేదిలేదని స్పష్టంగా తేల్చిచెప్పారు. స్కిల్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి జైలులో  రిమాండులో ఉన్న చంద్రబాబు ఎపిసోడుకు తెలంగాణాకు ఏమి సంబంధమని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టయ్యింది ఏపీలో కాబట్టి టీడీపీ నినసనలు, ఆందోళనలు ఏమి చేసినా ఏపీలోనే చేసుకోవాలన్నారు.





రాజమండ్రి దద్దరిల్లిపోయేట్లుగా టీడీపీ ఎలాంటి నిరసనలు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు అరెస్టన్నది రెండుపార్టీల మధ్య వివాదంగా కేటీయార్ తేల్చేశారు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణాకు ఏమీ సంబంధంలేదన్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్టయితే తెలంగాణాలో నిరసనలు తెలుపుతామంటే అంగీకరించేది లేదన్నారు. పక్కింట్లో పంచాయితీలను కూడా తెలంగాణానే తీర్చాలంటే సాధ్యంకాదన్నారు.





తనకు జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్, లోకేష్ అందరు మిత్రులే అన్నారు. కాబట్టి వాళ్ళ గొడవల మధ్యలోకి తెలంగాణాను లాగొద్దన్నారు. అరెస్టు, రిమాండు నేపధ్యంలో ప్రభుత్వం, టీడీపీ కోర్టుల్లో గొడవలు పడుతున్నపుడు అలాగే తేల్చుకోవాలని చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగానో లేకపోతే జగన్ కు వ్యతిరేకంగానో హైదరాబాద్ లో నిరసనలు చేస్తామంటే ఎలా అంగీకరిస్తామన్నారు. హైదరాబాద్ లో నిరసనలకు అనుమతులు ఇవ్వాలని మధ్యవర్తుల ద్వారా లోకేష్ తనను అడిగినట్లు కేటీయార్ చెప్పారు.  చంద్రబాబు అరెస్టుపై తెలంగాణాలో ఎలాంటి నిరసనలకు అనుమతించేది లేదని తాను స్పష్టంగా చెప్పేసినట్లు కేటీయార్ చెప్పారు.





ఏపీలో సమస్యలకు తెలంగాణాలో జనాలను ఇబ్బందులు పెడతామంటే ఎలా అంగీకరిస్తామని కేటీయార్ ఎదురు ప్రశ్నించారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో  ఐటి ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేశారు. కొన్నిచోట్ల అవి సృతిమించటంతో పోలీసులు లాఠీలకు పనికూడా చెప్పారు. దాంతో హైదరాబాద్ లో కొన్నిచోట్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు విషయంలో హైదరాబాద్ లేదా తెలంగాణాలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీయార్ చెప్పారు. కేటీయార్ తాజా ప్రకటన టీడీపీకి పెద్ద షాకనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: