
తెలుగుదేశంపార్టీకి చివరకు అత్త భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణే దిక్కయ్యేట్లున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబునాయుడు 21 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నారు. తనను ఎక్కడ అరెస్టుచేస్తారో అన్న భయంతో లోకేష్ ఢిల్లీలో కూర్చున్నారంటు జరుగుతున్న ప్రచారం అందిరకీ తెలిసిందే. 13 రోజులుగా లోకేష్ ఎందుకు ఢిల్లీలో కూర్చున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసమే ఢిల్లీలో కూర్చున్నారన్న ప్రచారం నిజమే అయితే ఢిల్లీలో కూర్చుని వేస్టనే అనిపిస్తోంది. చంద్రబాబు జైలులోను లోకేష్ ఢిల్లీలోను కూర్చుంటే మరి పార్టీని ఎవరు నడిపించాలి ? ఇపుడీ సమస్యే తమ్ముళ్ళని బాగా వేధిస్తోంది. అందుకనే వేరే దారిలేక భువనేశ్వరిని రోడ్లమీదకు తీసుకొస్తున్నారు తమ్ముళ్ళు. ఇప్పటికి రెండు సందర్భాల్లో నేతలను కలిసి భువనేశ్వరి మాట్లాడారు. అంటే రేపు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిరగటానికి భువనేశ్వరిని మిగిలిన తమ్ముళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు.
ఇదే సమయంలో బ్రాహ్మణి కూడా రెడీ అవుతున్నారు. ఐటి ఉద్యోగులతో పాటు జనసేన నేతలతో బ్రాహ్మణి ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. కాకపోతే పార్టీ కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకోపోవాలో బ్రాహ్మణికి అర్ధంకావటంలేదు. ఎంతైనా అత్తా, కోడళ్ళకు పార్టీ యాక్టివిటీస్ కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందులు తప్పవు. నిజానికి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నా పెద్దగా ఉపయోగంలేదు.
అచ్చెన్న కాకుండా చెప్పుకోవటానికి యనమల, చింతకాయల, నిమ్మకాయల, బండారు, గోరంట్ల లాంటి చాలామంది తమ్ముళ్ళున్నా వీళ్ళు దేనికీ ఉపయోగపడరు. వీళ్ళల్లో చాలామందికి జనబలమే లేదు. తమ నియోజకవర్గాల్లో పార్టీకి గాలుంటే మాత్రమే గెలుస్తారు. ఇలాంటి వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయమంటే పార్టీకి నాయకత్వం వహించాలంటే వీళ్ళవల్లేమవుతుంది. నిజానికి భువనేశ్వరి, బ్రాహ్మణి వల్ల కూడా కాదు. కాకపోతే చంద్రబాబు అరెస్టు తాలూకు సెంటిమెంటు పనిచేయాలంటే వీళ్ళిద్దరే సరైన వాళ్ళు. అందుకనే పార్టీ అంతా కలిపి భువనేశ్వరి, బ్రాహ్మణిని ముందుకు తోస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.