
జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తండ్రి, కొడుకులు చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు తమ్ముళ్ళంతా ఒక చాలెంజ్ విసురుతుంటారు. ఏమిటంటే జగన్ ఏ తప్పుచేయనపుడు తన కేసులవిచారణను వెంటనే పూర్తి చేయమని కోర్టులను అడగచ్చు కదా ? అని. అదే ఇపుడు చంద్రబాబు, లోకేష్ కు కూడా వర్తిస్తుంది. తామిద్దరు ఏ తప్పు చేయనపుడు, ఎక్కడా అవినీతికి పాల్పడకపోతే మరి తమపై సీబీఐ విచారణ చేయమని సవాలు చేయచ్చు కదా ? ఎందుకు అడగటంలేదు ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
బెయిల్, ఇంటెరిం బెయిల్, ముందస్తు బెయిల్ కోసం గడచిన 16 రోజులుగా చంద్రబాబు ఎంత అవస్తలు పడుతున్నారో అందరు చూస్తున్నదే. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో తనపైన సీఐడీ కేసు నమోదుచేయగానే అరెస్టుకాకుండా వెంటనే లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి, కొడుకులు ఇద్దరు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? న్యాయస్ధానంలో పోరాడి తాము కడిగిన ముత్యాలమని నిరూపించుకోవచ్చు కదా.
తమను తాము నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని తండ్రి, కొడుకులు ఇద్దరు ఎందుకని జారవిడుకుంటున్నట్లు ? ఇదే విషయాన్ని మాజీమంత్రి కొడాలి నాని కూడా ప్రశ్నించారు. తండ్రి, కొడుకులు ఇద్దరు బెయిల్ కోసం ప్రయత్నం చేసుకునేబదులు తామిద్దరం నిప్పులమని కోర్టులో నిరూపించుకోవచ్చు కదా అని నిలదీశారు. జగన్ విషయంలో ఏమో విచారణను వెంటనే పూర్తిచేయాలని కోర్టులకు లేఖలు రాయాలని చాలెంజ్ విసురుతారా ? తమ దగ్గరకు వచ్చేసరికి బెయిల్ కోసం తనకలాడుతున్నారా.
అంటే ప్రత్యర్ధులను తాము ఏమన్నా ఎవరు నోరిప్పకూడదు. ఇదే సమయంలో తమను ఎవరేమన్నా అంటే మాత్రం సహించరు. వీళ్ళకన్నా ముందు వీళ్ళ తరపున ఎల్లోమీడియానే రెచ్చిపోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో లోకేష్ బాగా గట్టిగా తగులుకున్నాడని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్విడ్ ప్రో కో విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా బాగా ఇరుక్కున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. మరి కోర్టులు ఏమంటాయో చూడాల్సిందే.