తెలుగుదేశంపార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. అవసరమైనపుడు ఎవరినైనా ఫుల్లుగా వాడేయటం అవసరం తీరిపోయిందనగానే అవతల తీసిపారేయటం చాలా తేలిగ్గా జరిగిపోతుంది. ఇపుడు విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండుకు నిరసనగా గాంధీజయంతి రోజున నిరసన దీక్షలు జరిగాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు దీక్ష చేస్తే రాజమండ్రిలోనే భువనేశ్వరి, ఢిల్లీలో లోకేష్ దీక్షలో కూర్చున్నారు.





పనిలోపనిగా మంగళగిరిలో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా దీక్ష చేశారు. ఇపుడు అసలు విషయం ఏమిటంటే వీళ్ళు దీక్షలు చేసిన ప్రతిచోటా ప్రముఖంగా ఎన్టీయార్, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలు దర్శనమిచ్చాయి. ఈ ఫొటోలో కూడా చంద్రబాబు, భువనేశ్వరి కన్నా ఎన్టీయార్ బొమ్మ చాలా ప్రముఖంగా కనిపిస్తోంది. చంద్రబాబుకు లేదా టీడీపీకి ఎప్పుడు అవసరమైపుడల్లా ఎన్టీయార్ ఫొటోను ప్రముఖంగా వాడేయటం చాలా అలవాటు.





ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా దింపేసిన తర్వాత పార్టీ అధ్యక్షపదవిని కూడా లాగేసుకున్నారు. అప్పటినుండి చాలాకాలం  ఎన్టీయార్ ఫొటోను చంద్రబాబు కనబడకుండా చేసేశారు. ఎన్టీయార్ ఫొటోలను పార్టీ ఆఫీసుల్లో ఎక్కడా కనబడకుండా తీసి లోపల పడేశారు. తర్వాత ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఎన్టీయార్ ఫొటోలు, విగ్రహాలే దిక్కయ్యాయి. ఎన్నికలు ఏవైనా, చంద్రబాబుకు ఏ అవసరమైనా వెంటనే ఎన్టీయార్ విగ్రహాలకు పూలమాలలు వేయటం, ఫొటోలకు దణ్ణాలు పెట్టడం నిత్యమైపోయింది.





పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ పరిస్ధితి చివరకు ఇలాగైపోయిందని ఎన్టీయార్ అభిమానులందరు నిట్టూర్చని రోజులేదు. అలాంటిది సాక్ష్యాధారాలతో సహా అవినీతి కేసులో ఇరుక్కుని జైలులో రిమాండు అనుభవిస్తు కూడా సత్యమేవ జయతే అనే నినాదంతో గాంధీజయంతి రోజున దీక్షలు చేయటం చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, తమ్ముళ్ళకే చెల్లింది. తమ దీక్షలకు ఎన్టీయార్ ఫొటోతో పాటు  మహాత్మాగాంధీ పేరును కూడా వాడేసుకోవటం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. సమాజం ఏమనుకుంటుందో అన్న వెరపు కూడా లేకుండా తాము అనుకున్నది అనుకున్నట్లు చేసేయటమే చంద్రబాబు, టీడీపీ లక్షణం.

మరింత సమాచారం తెలుసుకోండి: