
తాజాగా కృష్ణాజిల్లా అవనిగడ్డలో మొదలైన వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ్ముళ్ళపై పెద్ద బాంబు వేసినట్లే ఉన్నారు. పవన్ మాటలు తమ్ముళ్ళకు షాక్ ఇచ్చినట్లే ఉన్నది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయేది టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. 175 సీట్లకు 160 సీట్లలో తమ సంకీర్ణమే గెలుస్తుందని జోస్యం కూడా చెప్పారు. తర్వాత యధాప్రకారంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని నోటికొచ్చింది మాట్లాడి తన కసినంతా తీర్చుకున్నారు.
మధ్యలో ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నట్లు అసందర్భంగా ఒక మాటన్నారు. ముఖ్యమంత్రి పదవి వస్తే అని అన్నారు. వస్తే అంటే ఎలా వస్తుంది ? సంకీర్ణంలో తెలుగుదేశంపార్టీదే పెత్తనమని అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడు ఉండగా ముఖ్యమంత్రి పదవి ఇంకోళ్ళకి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా ఎప్పుడు అధికారంలోకి వచ్చేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుందామా అని చంద్రబాబు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పైగా ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతాననే శపథం కూడా చేసున్నారు. అలాంటపుడు సడెన్ గా ముఖ్యమంత్రి పదవి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ చేసిన ప్రకటనకు అర్ధమేంటి ? స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైలునుండి చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవని పవన్ కు ఏమన్నా సమాచారం ఉందా ? ఎన్నికలు జరిగేటప్పటికి చంద్రబాబు జైలులోనే ఉంటారని పవన్ బలంగా నమ్ముతున్నట్లున్నారు.
సంకీర్ణాన్ని తానే నడిపించాలని ఫిక్సయ్యారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే స్కిల్ స్కామ్ మాత్రమే కాదు చంద్రబాబు పైన ఇంకా మూడు కేసులు నమోదయ్యున్నాయి. వీటిల్లో విచారణ కోసం సీఐడీ ఇప్పటికే పీటీ (ప్రిజనర్ ఆన్ ట్రాన్సిట్) వారెంటులు దాఖలు చేసున్నాయి. స్కిల్ కేసులో బెయిల్ వచ్చినా వెంటనే మరో కేసులో అరెస్టుచేసి రిమాండుకు పంపించేందుకు సీఐడీ రెడీగా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడిప్పుడే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశాలు లేవని పవన్ ఫిక్సయినట్లున్నారు. అందుకనే అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవి తీసుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా చంద్రబాబు ప్రస్తావన తేకుండా ముఖ్యమంత్రి పదవిని తీసుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పటమే తమ్ముళ్ళకి షాకిచ్చినట్లయ్యింది.