గ్రౌండ్ లెవల్లో వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కృష్ణాజిల్లాలో మొదలైన నాలుగో విడత వారాహియాత్రలో పవన్ మాట్లాడుతు ముఖ్యమంత్రి పదవిని అందుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చంద్రబాబునాయుడు జైలులో ఉన్న సమయంలో పవన్ ముఖ్యమంత్రి పదివి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పటం ఏమిటంటు తమ్ముళ్ళు షాక్ కు గురయ్యారు. పవన్ ప్రకటన జనాలకు ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తాయో తమ్ముళ్ళకు అర్ధంకావటంలేదు.





ఈ విషయం ఇలాగుండగానే తెలంగాణాలో 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు. ఉత్తినే చెప్పటమే కాకుండా నియోజకవర్గాలను కూడా ప్రకటించేశారు. అభ్యర్ధులను  ప్రకటించటం మాత్రమే ఇక మిగిలింది. నిజానికి తెలంగాణాలో జనసేన పార్టీని పట్టించుకునే వాళ్ళే లేరు. ఎందుకంటే పార్టీ బలోపేతానికి పవన్ తెలంగాణాలో పర్యటించింది లేదు. కేసీయార్ గురించి మాట్లాడాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడకుండా ఇక రాజకీయం ఏమిచేస్తారు ?





అందుకనే తెలంగాణాలో పర్యటన గురించి ఆలోచనే మానుకున్నారు. పవన్ పర్యటించకపోతే మామూలు జనాలు జనసేనను ఎందుకు పట్టించుకుంటారు. ఏదో పేరుతో ఏపీలో తిరుగుతుంటేనే పార్టీని జనాలు పట్టించుకోవటంలేదు. అలాంటిది ఇక తెలంగాణాలో ఉనికిలో కూడా జనసేన లేదు. ఉనికిలోనే లేని తెలంగాణాలో 32 నియోజకవర్గాల్లో పోటీచేయటం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణాలోనే 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నదంటే అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమల్లో ఉన్న ఏపీలో ఎన్నిసీట్లకు పోటీచేయాలి ?





ఇప్పటికైతే అధికారికంగా జనసేన పోటీచేయబోయే నియోజకవర్గాల సంఖ్య తెలీదు. అయితే అనధికారికంగా మాత్రం సుమారు 25 నియోజకవర్గాలనే ప్రచారం బాగా జరుగుతోంది. అయితే తెలంగాణాలో పోటీచేయబోయే నియోజకవర్గాల సంఖ్య ప్రకటించిన తర్వాత తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తెలంగాణాతో పోల్చుకుంటే ఏపీలో కనీసం 50 నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతోందేమో అనే ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో రెండుపార్టీల నేతలు కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. తెనాలి, భీమిలి, విశాఖ ఉత్తరం, తిరుపతి, పిఠాపురం, పెందుర్తి లాంటి అనేక నియోజకవర్గాల్లో రెండుపార్టీల నేతలు పోటీకి గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: