ఈనెల 30వ తేదీన జరగబోయే తెలంగాణా పోలింగులో రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు వర్గాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లున్నాయి. సంక్షేమపథకాలు అమలుచేశామని, ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. ఇదే విషయాన్ని బహిరంగసభల్లో కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు పదేపదే ప్రస్తావిస్తున్నారు. మంచి చేసే బీఆర్ఎస్ కావాలా లేకపోతే ముంచేసే కాంగ్రెస్ కావాలా అంటు సెటైర్లు వేస్తున్నారు.





ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారపార్టీపై ఎదురుదాడి చేస్తోంది. సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో కేసీయార్ కుటుంబం మొత్తం తెలంగాణాను దోచుకున్నదని ఆరోపిస్తున్నది. వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా ఒకటి మాత్రం వాస్తవం. అదేమిటంటే రెండుపార్టీల గెలుపోటములను రెండు వార్గాలే డిసైడ్ చేస్తాయనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇంతకీ ఆ వర్గాలు ఏమిటంటే నిరుద్యోగులు, కౌలు రైతులు. ప్రభుత్వ  లెక్కల ప్రకారమే నిరుద్యోగులు సుమారు 35 లక్షలమందున్నారు. అలాగే కౌలురైతుల సంఖ్య సుమారు 30 లక్షలుంటుంది.





ఇన్నేసి లక్షలున్న ఈ రెండు వర్గాలను కేసీయార్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యంచేసిదో అర్ధంకావటంలేదు. నీళ్ళు, నియామకాలు, నిధుల స్లోగన్ తో ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. ఈ మూడింటిని హైలైట్ చేయటంలో విద్యార్ధులు, నిరుద్యోగులే కీలకపాత్ర పోషించారు. అలాంటిది ప్రత్యేక తెలంగాణా ఏర్పడి కేసీయార్  ముఖ్యమంత్రి అయిన తర్వాత నియామకాలను గాలికొదిలేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం నియామకాలు చేయలేదు.





ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకుని సడెన్ గా నోటిఫికేషన్లు ఇష్యూచేసింది ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ అంతా దరిద్రమైపోయింది. ప్రతి పరీక్షపత్రమూ లీకైపోవటమే. ప్రశ్నపేపర్లు లీకవ్వటం, నోటిఫికేషన్లు రద్దవ్వటంతో పాటు అనేక విషయాలపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. దాంతో ఉద్యోగాల భర్తీ మొత్తం అస్తవ్యస్ధమైపోయింది. ఇక కౌలురైతులను ప్రభుత్వం అసలు రైతులుగానే గుర్తించటంలేదు. రైతుబంధు, రైతురుణమాఫీ పేరుతో అమలుచేస్తున్న పథకాల్లో ఏవీ కౌలు రైతులకు అందటమే లేదు. దాంతో ఈ రెండు సెక్షన్లు ప్రభుత్వంపై బాగా  మండిపోతున్నాయి. ఇదే తమకు అడ్వాంటేజ్ అవుతుందని కాంగ్రెస్ అనుకుంటోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: