తెలంగాణలో ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగనుంది.ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? వాటిని ఎలా నిర్వహిస్తారు ? ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పే లెక్కలు ఎంత వరకు నిజం.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఎగ్జిట్ పోల్స్ అంటే ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయనే దాని గురించి ఇచ్చే సమాచారం. ఇవి వార్తా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహించే ఓటరు సర్వేలు. ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్  గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి. అందువల్ల విజేతలను అంచనా వేయడంలో సహాయపడతాయి.అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నమ్మదగినవి కానప్పటికీ, అవి ఎన్నికలకు సంబంధించిన చాలా అంశాల గురించి స్థూలమైన అంచనాను అందిస్తాయి.ఇక కొన్ని ప్రత్యేక సంస్థలు ఎన్నికలకు ముందు ప్రీపోల్స్, ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. ప్రీపోల్స్ సర్వేలు అనేవి ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు చేపట్టే ప్రక్రియ. వివిధ రాజకీయ పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటు ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుందని విశ్లేషిస్తారు. పోలింగ్ తేదీ సమీపించినప్పుడు నియోజకవర్గాల వారీగా కొందరు ఓటర్లను ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుని ప్రీపోల్స్ నిర్వహిస్తారు. ఆ నియోజకవర్గాల వారీగా ఓటర్లను కలుసుకుని ఏ అభ్యర్థి నిలబడతారు, ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని సేకరించి పోల్ రిజల్ట్ వెల్లడిస్తారు.ఇక ఎగ్జిట్ పోల్స్ అయితే అలా కాదు. పోలింగ్ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రల వద్ద ఓట్ల నాడీని తెలుసుకుని ఆ తరువాత ఒక అంచనాకు వస్తారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కకడతారు.


ఇక ప్రీపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు ఇంకా మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొని సర్వే చేస్తారు. కానీ ఎగ్జిట్‌పోల్‌లో అయితే అలా కాదు. పోలింగ్ రోజే, ఓటు వేసేందుకు వచ్చే వారిని మాత్రమే ప్రశ్నించి సమాచారాన్ని సేకరిస్తారు.మొత్తంగా ప్రీపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో ఖచ్చితత్వానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్‌కు దాదాపు దగ్గరగా ఉంటాయి. ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఇక ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే సరైన ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణలో BRS, కాంగ్రెస్ పార్టీల హవా గట్టిగా ఉంది. ప్రమోషన్స్, యాడ్స్ తో చాలా సందడి చేశారు. మరి ఈ రెంటిలో ఏది అధికారంలోకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: