తెలంగాణాలోకి ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం ఆదివారం తెలుస్తుంది. అయితే తెలంగాణా ఎన్నికల ప్రభావం ఏపీ పైన ఉంటుందనే చర్చ మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. తెలంగాణా ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపైన ఎలాగుంటుందని అడిగితే మాత్రం లాజిక్ లేకుండా ఏదేదో చెప్పేస్తున్నారు. చాలామంది చెప్పే మాటేమిటంటే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయితే టీడీపీ బలం పెరుగుతుందని.





తెలంగాణాకు రేవంత్ ముఖ్యమంత్రయితే చంద్రబాబునాయుడు అయినట్లేనట. ఎందుకంటే చంద్రబాబుకు రేవంత్ బాగా ఇష్టుడు కాబట్టే అనంటున్నారు. పైగా వీళ్ళ బంధం అంటేనే అందరికీ ఓటుకునోటు కేసే గుర్తుకొస్తుంది. రేవంత్ సీఎం అయితే చంద్రబాబుకు ఎంతవరకు ఉపయోగం ఉంటుందో తెలీదు కానీ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం బాగానే ఉపయోముంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే  రాష్ట్రాలు రెండైనా పార్టీ ఒకటే కాబట్టి ప్రతి అవసరానికి ఏపీ కాంగ్రెస్  నేతలకు సాయం అందించవచ్చు.





అయితే టీడీపీకి ఏ విధంగా లాభం జరుగుతుందో మాత్రం అర్ధంకావటంలేదు. తెలంగాణాలో రేవంత్ సీఎం అయితే దాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది. నిజంగా ఇందులో ఎంతమాత్రం అవకాశంలేదు. ఎందుకంటే పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు. పైగా తెలంగాణాలో సీమాంధ్ర ఓట్లు బీజేపీకి పడకుండా చంద్రబాబే అడ్డుకున్నారనే విషయం నిర్ధారణైతే నరేంద్రమోడీ ఒక చూపు చూడాలని డిసైడ్ అయితే చంద్రబాబు పనైపోతుంది.





అదే జరిగితే చంద్రబాబు ఏపీలోనే కాదు హైదరాబాద్ లో  కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఇప్పటికే చంద్రబాబు మీద అనేక కేసులున్నాయి. వీటిల్లో ఏ ఒక్కదానిలో గట్టిగా తగులుకున్నా కొంతకాలంపాటు జైలులో ఉండాల్సిందే. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఏదైనా అంశంపై సమస్య తలెత్తితే కేంద్రం ఏపీకి మద్దతుగా నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మొదలైతే అప్పుడు జగన్ సెంటిమెంటును రాజేస్తే ఏపీలో టీడీపీనే ఎక్కువ నష్టపోతుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా తెలంగాణా రాజకీయాలు ఏపీపైన ప్రభావం చూపే అవకాశంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: