ఏలూరు జిల్లా చింత‌ల‌పూడి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత‌, మాజీ ఏఎంసీ చైర్మ‌న్ అయిన మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ( కేవీపీ రామ‌చంద్ర‌రావు బావ‌మ‌రిది) ఈ రోజు వైసీపీకి రాజీనామా చేసిన‌ట్టు ఒక్క‌సారిగా తీవ్ర క‌ల‌క‌లం రేగింది. ఇండియా హెరాల్డ్‌కు అందిన విశ్వ‌స‌నీయ‌ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అశోక్‌బాబుతో పాటు ఆయ‌న భార్య కామ‌వ‌ర‌పుకోట ఎంపీపీ అయిన మేడ‌వ‌ర‌పు విజ‌య‌ల‌క్ష్మి ఇద్ద‌రూ కూడా పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో పాటు వీటిని మండ‌ల పార్టీ ప్రెసిడెంట్ మిడ‌తా ర‌మేష్ ద్వారా జిల్లా పార్టీ కార్యాల‌యంతో పాటు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథ‌ర్‌కు పంపారు.

అశోక్ రాజీనామా ఎందుకు..?
అశోక్ రాజీనామా వెన‌క ఉన్న కార‌ణాలు కూడా ఇండియా హెరాల్డ్‌కు అందాయి. పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక ఎమ్మెల్యే ఎలీజాతో క‌లిసిన కొంద‌రు పార్టీ నేత‌లు అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌డంతో పాటు పార్టీలోనూ గ్రూపులు పెంచి పోషించార‌న్న అభియోగం ముందునుంచి ఉంది. దీనికి తోడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ వైసీపీలోనే రెండు గ్రూపులు వేర్వేరుగా పోటీ చేసినా కూడా అశోక్ స‌పోర్ట్ చేసిన ఫ్యానెల్స్ కామ‌ర‌పుకోట మండ‌లంలో విజ‌యం సాధించాయి.

తాము ఎలీజాతో పాటు ఆయ‌న అనుచ‌రులుగా ఉన్న వారి అవినీతిపై ఎంతో బ‌ల‌మైన పోరాటం చేసి మ‌రీ ఎలీజా సీటు మార్పించి విజ‌య‌రాజుకు వ‌చ్చేలా చేశామ‌ని చెపుతున్నారు. అయితే ఇప్పుడు ఇన్‌చార్జ్ విజ‌య‌రాజు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన అదే అవినీతి ప‌రుల‌ను ఎంక‌రేజ్ చేస్తుండ‌డంతో పాటు వారిని క‌లుపుకుని వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌డం అశోక్‌కు ఎంత మాత్రం న‌చ్చ‌లేదు. పైగా అశోక్‌తో పాటు సిట్టింగ్ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ అనుచ‌రులు కూడా దీనిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

తాము ఇంతా క‌ష్ట‌ప‌డి విజ‌య‌రాజుకు సీటు వ‌చ్చేలా చేస్తే.. ఇప్పుడు ఆయ‌న త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న వారిని ప్రోత్స‌హిస్తుండ‌డాన్ని నిరసిస్తూ ఈ రోజు ఉద‌య‌మే అశోక్‌తో పాటు ఆయ‌న భార్య‌, కామ‌వ‌ర‌పుకోట ఎంపీపీ విజ‌య‌ల‌క్ష్మి ఇద్ద‌రూ త‌మ పార్టీ స‌భ్య‌త్వాల‌కు రాజీనామా ప్ర‌క‌ట‌న చేశారు. అశోక్‌కు మ‌ద్ద‌తుగా కామ‌ర‌వ‌పుకోట‌, చింత‌ల‌పూడి, లింగ‌పాలెం మండ‌లాల్లో కూడా ప‌లువురు వైసీపీ పార్టీ నేత‌లు, పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా త‌మ ప‌ద‌వుల‌కు, స‌భ్య‌త్వాల‌కు రాజీనామాలు చేసేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంతో ఒక్క‌సారిగా చింత‌ల‌పూడి వైసీపీలో క‌ల్లోలం రేగింది.

జిల్లా పార్టీ నాయ‌క‌త్వంతో పాటు మిథున్‌రెడ్డి టీం కూడా దీనిపై ఆరా తీసింది. అశోక్‌కు తొంద‌ర‌ప‌డ వ‌ద్ద‌ని వ‌ర్త‌మానం కూడా పంపింది. ఐ ప్యాక్ టీం కూడా అశోక్ పార్టీకి రాజీనామా చేయ‌డంపై చింత‌ల‌పూడిలో గెలుపు అవ‌కాశాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్ప‌డంతో పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం అలెర్ట్ అవ్వ‌డంతో పాటు ఈ గొడ‌వ‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కొంద‌రు నేత‌ల‌ను పుర‌మాయించ‌నుంది. ఏదేమైనా అశోక్ రాజీనామా వ్య‌వ‌హారం ఒక్క‌సారిగా చింత‌ల‌పూడి వైసీపీని బాగా కుదిపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: