పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే సందేహాలకు తెర దించేశారు. కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించారు.  కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించడం షర్మిలకు సులువు కాదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడమే ఆమెకు మైనస్ కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
వైఎస్సార్ బిడ్డగా కడప ప్రజల్లో షర్మిలపై పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ వల్లే ఏపీకి తీవ్రస్థాయిలో అన్యాయం జరిగిందని ప్రజల్లో భావన ఉంది. కడపలో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయనుండగా ఆయనపై కొన్ని ఆరోపణలు ఉన్నా ఆయనకే అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్  ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా షర్మిల అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేవారని జిల్లా ప్రజానీకం చెబుతున్నారు.
 
గతంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల అన్నతో విబేధాలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలే తప్ప మరో రాజకీయ పార్టీ నుంచి అన్నకు వ్యతిరేకంగా పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. టీడీపీ, వైసీపీలలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు దక్కని అభ్యర్థులు కాంగ్రెస్ లో చేరారు. ఈరోజు 114 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో పాటు ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.
 
ఈ అభ్యర్థులలో ఎంతమంది అభ్యర్థులు టీడీపీ, వైసీపీలకు గట్టి పోటీ ఇస్తారో చూడాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల టికెట్లు దక్కని అభ్యర్థులు కాంగ్రెస్ పై దృష్టి పెట్టాల్సి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏపీలోని కొన్ని స్థానాలలో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపే అవకాశాలు  లేవని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఆధారంగా షర్మిల రాజకీయ భవిష్యత్తు డిసైడ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: