
విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చడానికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిలో టిసిఎస్ గేమ్ ఛేంజర్ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. విశాఖలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ నిర్వాకంతో ఐటి హిల్స్ నుంచి పారిపోయిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయి. రాష్ట్ర ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. ఫలితంగా గత 10నెలల్లో 8లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి. బడా సంస్థలను ఆకర్షించేందుకు వివిధరకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రభుత్వాల వ్యూహంలో భాగం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో గుజరాత్ సిఎంగా పనిచేసే సమయంలో టాటా మోటార్స్‌ను గుజరాత్‌లోని సనంద్‌కు తీసుకెళ్లేందుకు 99 పైసలకు భూమిని కేటాయించారు. ఇది గుజరాత్‌లోని ఆటో పరిశ్రమకు ఒక మైలురాయిగా నిలచింది. అదేతరహాలో ఎపిలో టిసిఎస్ కు భూములు కేటాయించి ఐటి పరిశ్రమకు జవసత్వాలు నింపేందుకు కృషి జరుగుతోంది.
గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన ఐటిరంగానికి జవసత్వాలు నింపే దిశగా మంత్రి లోకేష్ చర్యలు చేపట్టారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటి, ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలోని లేనివిధంగా అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 2024-29 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ & డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీలను ప్రకటించారు. అక్టోబర్ 25 నుంచి వారంరోజుల పాటు అమెరికాలో పర్యటించారు. సిలికాన్ వ్యాలీ, సీటెల్, న్యూయార్క్‌తో సహా ప్రధాన US నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఎపిలో పెట్టుబడి అవకాశాలపై ప్రపంచస్థాయి టెక్నాలజీ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చలు జరిపారు.టెస్లా, గూగుల్, యాపిల్, అడోబ్, మైక్రోసాఫ్ట్, ఫాల్కొన్ ఎక్స్, సేల్స్ ఫోర్స్, జడ్ స్కాలర్ వంటి 100 ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5ఏళ్లలో 5లక్షలు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.