కవిత రాసిన లేఖ లీక్‌తో బీఆర్ఎస్‌లో వాతావరణం మారిపోతోంది. కేసీఆర్‌ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. “కేసీఆర్‌ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్లే పార్టీకి నష్టం జరుగుతోంది” అని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. అంతేకాక, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న భావనలపై రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు జోరందుకున్నాయి.

కవిత తన తండ్రి కేసీఆర్‌కు రెండు వారాల క్రితం రాసిన లేఖ రెండు రోజుల క్రితం బహిర్గతమైంది. ఈ లేఖ బయటకు రావడంపై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనాయకుడికే రాసిన లేఖ లీక్ అయితే, పార్టీలోని సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పార్టీకి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల భావనలే తన లేఖలో ప్రతిబింబించాయని పేర్కొన్నారు.

ఆమె లేఖ బహిర్గతం కావడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపించారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇదే సమయంలో పార్టీలో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలపై గతంలోనూ కేసీఆర్‌కు లేఖ రాశానని కవిత గుర్తు చేశారు. “ఇది నా వ్యక్తిగత విమర్శ కాదు. ఎవరిపై ప్రేమ లేదు, ద్వేషం లేదు. కానీ పార్టీకి నష్టం చేసే దెయ్యాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అంటూ సూచించారు.

ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ ఎలా స్పందిస్తారు? కుమార్తె రాసిన లేఖను సీరియస్‌గా తీసుకుని, ఆమె చూపిన 'దెయ్యాల'ను దూరం పెడతారా? లేక వాటిపైనే ఆధారపడతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న అసంతృప్తి క్రమేపీ వెలుగులోకి వస్తుండటంతో, పార్టీ భవిష్యత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, శ్రేణులు గైర్హాజరు కావడం కూడా ప్రశ్నలు రేపింది. కేవలం బీసీ సంఘాల నాయకులు, జాగృతి కార్యకర్తలు మాత్రమే ఆమెకు స్వాగతం పలికారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల ఫొటోలు లేకుండా వచ్చిన ప్లకార్డులు, బీఆర్ఎస్ జెండాలు గైర్హాజరై ఉండటం గమనార్హం. మరి పార్టీలో ఈ అంతర్గత తడబాటు పునఃపరిశీలనకు దారి తీస్తుందా? కేసీఆర్‌ ధైర్యంగా ఈ సంక్షోభాన్ని అధిగమిస్తారా? లేక బీఆర్ఎస్‌లో విభేదాలు మరింత ముదురుతాయా? అన్నది చూడాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: