
ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన ఎమ్మెల్యే.. పైకి మాత్రం అమాయకంగా.. తనకేం తెలియని వాడిలా నటిస్తాడన్న పేరుంది. కానీ ఆయనలోని లోపల మనిషి మాత్రం దోపిడీలో రా " రాజు " గా ఉంటాడన్న విమర్శలు నియోజకవర్గంలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి యేడాది అవుతుందో లేదో కాని అవినీతి రా " రాజు " గా మారిపోయాడన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గెలిచిన రెండు నెలల నుంచే ఎక్కడికక్కడ టార్గెట్లు పెట్టడం, దోచుకోవడానికి దోపిడీకి ఏయే శాఖలు.. ఏయే వనరులు ఉన్నాయో వెతుక్కోవడం మీదే దృష్టి పెడుతూ వచ్చారు. తాజాగా ఈ అవినీతి రా " రాజు " గారైన ఎమ్మెల్యే పుట్టిన రోజు కోసం నియోజకవర్గంలో భారీ ఎత్తున చందా దందా నడిచింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త క్యాంప్ కార్యాలయంలో భారీ ఎత్తున హంగామా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక జరుగుతోన్న తొలి పుట్టిన రోజు కావడంతో నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులతో పాటు కూటమి పార్టీ నాయకులు.. ఇటు ప్రభుత్వ అధికారులు అందరిని ఆహ్వానించారు.
భారీ ఎత్తున వేడుకలు చేయడంతో పాటు భోజనాల ఏర్పాట్లు ధూంధాంగా చేశారు. అక్కడకు వచ్చిన వేలాది మందికి రకరకాల ఐటెంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇందుకు భారీగానే ఖర్చయ్యింది. ఈ ఖర్చంతా ఆ ఎమ్మెల్యే సొంత జేబులోనుంచి ఏమీ తీయలేదు. అధికారుల జేబులకు చిల్లులు పెట్టేశారు. తన పుట్టిన రోజుకు అయిన ఖర్చంతా నియోజకవర్గంలోని అధికారుల నుంచి టార్గెట్లు పెట్టి కొంత... చందాలు కావాలని దందా చేసి మరి కొంత లాగేశారు. రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరు లక్షల్లోనే సమర్పించుకున్నారు. మండలాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఇక వీఆర్వోలు తమకు తోచినంత ఇచ్చుకోక తప్పలేదు.
పంచాయతీ కార్యదర్శులతో పాటు సచివాలయాల ఉద్యోగులను కూడా వసూళ్ల దందా కోసం వాడుకున్నారు. ఇక ఆల్ డిపార్ట్‌మెంట్స్ హెడ్స్ కూడా చందా దందా తప్పలేదు. అధికారులు ఎమ్మెల్యే అంటే నయానో భయానో సమర్పించుకున్నారు.. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఖర్చంతా వాళ్లు తమ దగ్గరకు పనుల కోసం వచ్చే ప్రజల మీద వేసి అంతకు డబుల్ .. అంతకంటే ఎక్కువే గుంజేచేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇలా ఎమ్మెల్యే తాను డైరెక్ట్‌గా అవినీతి చేయడంతో పాటు ఇలా పరోక్షంగా అధికారులతోనూ అవినీతి చేయించేలా.. తనకు ఓట్లేసి గెలిపించి.. తనను ఎమ్మెల్యేను చేసిన ప్రజలను గుల్ల గుల్ల చేసేలా ప్రోత్సహిస్తోన్న వైనం ఇప్పుడు జనసేన వర్గాలతో పాటు నియోజకవర్గంలో తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
ఎన్నికలకు ముందు ఎంతో నిజాయితీగా ఉంటా... " ధర్మం " తప్పను అని చెప్పిన కల్లిబొల్లి కబుర్లు విన్న కూటమి పార్టీల నాయకులు సైతం ఇదేం అ " ధర్మం " రా బాబు అంటూ ముక్కున వేలేసుకుంటోన్న పరిస్థితి. ఏదేమైనా ఈ ఎమ్మెల్యే తీరు మారకపోతే నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు ఎన్నికలైన యేడాదికే వచ్చేయడం ఖాయం.