తెలంగాణ రాజకీయాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ తో పాటు బీజేపీ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. బీజేపీ కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నా.. ఇప్పుడు రేసులోకి వ‌చ్చి హ‌డావిడి చేస్తోంది. కొత్త అధ్య‌క్షుడిగా ఎంపికైన రామ‌చంద్ర‌రావు జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీని గెలిపించి.. త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట పెంచుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. పైగా ఈ సీటు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న సికింద్రాబాద్ పార్ల‌మెంటు సీటు ప‌రిధిలో ఉంది. ఈ ఉప ఎన్నిక అటు కిష‌న్‌రెడ్డికి కూడా చాలా ప్ర‌తిష్టాత్మ‌కం కానుంది. తెలంగాణ‌లో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉంటే అధికార ప‌క్షానికి ఉప ఎన్నిక‌ల్లో గెలుపు అంత వీజీకాద‌ని బీజేపీ లెక్క క‌డుతోంది. మొన్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కాంగ్రెస్ కేవ‌లం ఇబ్ర‌హీంప‌ట్నం సీటుకే మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. రేవంత్ రెడ్డి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు.


జ‌నాల్లో కాంగ్రెస్‌కు ఇంకా క్రేజ్ ఉంది.. ప‌ట్టు త‌గ్గలేదు అని ఫ్రూవ్ చేసుకునేందుకు అయినా జూబ్లిహిల్స్‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగ‌రాల‌ని కంక‌ణం క‌ట్టుకుని ఉన్నారు. అవ‌స‌రం అయితే నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్ష‌కు పైగా ఉన్న మైనార్టీ ఓట‌ర్ల‌కు గాలం వేసేందుకు మ‌జ్లిస్ సపోర్ట్ తీసుకోవాల‌ని భావిస్తున్నారు. అటు బీఆర్ఎస్ త‌మ సిట్టింగ్ సీటు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలుచుకోవాల‌ని క‌సితో ఉంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిర‌క‌త ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక గ్రేట‌ర్ ప‌రిధిలో బీఆర్ఎస్ బ‌లంగా ఉంది. దీనికి తోడు త‌మ సిట్టింగ్ సీటును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కోల్పోకూడ‌ద‌ని కేటీఆర్ పంతంతో ఉన్నారు. మృతిచెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యనే రంగంలోకి దింపి గెలిపించుకోవాల‌ని కేటీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది.

 

కేటీఆర్ జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక విష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు... బీఆర్ఎస్ త‌ర‌పున భ‌విష్య‌త్తు సీఎంగా త‌న‌ను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు కేటీఆర్ ఈ ఉప ఎన్నిక‌ను అస్త్రంగా వాడుకోవాల‌ని చూస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే రాజ‌కీయ ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవాల‌ని.. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తెర‌మీద‌కు తెస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇక బీజేపీ కూడా త‌న ప్ర‌య‌త్నాలు తాను చాప‌కింద నీరులా చేస్తోంది. ఓవ‌రాల్‌గా జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ట్ర‌యాంగిల్ ఫైట్ అయితే ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి ఇక్క‌డ ఎగిరేది ఏ పార్టీ జెండాయో ఇప్ప‌ట‌కీ అయితే ఓ అంచ‌నాకు రాలేని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: