
ఇది ఆధిపత్య రాజకీయాల దిశగా వెళుతూ నిమ్మకను ఒత్తిడికి గురి చేస్తోంది. స్థానిక టీడీపీ నేతలలో ఒకరు తనను సంప్రదించకుండానే ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని జయకృష్ణ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ల ఎంపిక, లబ్ధిదారుల నిర్ణయం వంటి అంశాల్లో తాను పూర్తిగా సైడ్ అయిపోతున్నానన్న ఆవేదన ఆయనలో ఉంది. జనసేన శ్రేణుల్లో కూడా అసంతృప్తి ఉంది. “ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మా సమస్యలను పట్టించుకోవడం లేదు” అని ఒక వర్గం విమర్శిస్తుండగా, మరికొందరు తన హక్కులే సాధించుకోలేకపోతున్నాడు, ఆయన అసలు ఎమ్మెల్యేగా ఎంతవరకు ఉన్నారో మాకే తెలియడం లేదు అంటున్నారు.
ఇటీవల జయకృష్ణ స్వయంగా ఈ ఆవేదనను వ్యక్తం చేశారు. “ఎమ్మెల్యేగా ఉన్నా పాలకొండలో ఏం చేయలేకపోతున్నా” అంటూ బహిరంగంగా చెప్పడం పెద్ద చర్చనీయాంశమైంది. స్థానిక టీడీపీ నేతలు ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ఆరోపించినా, వారంతా సీనియర్లు కావడంతో తాను ఏమి చేయలేకపోతున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ ఇన్చార్జ్ పడాల భూదేవి వ్యవహారంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం చేపడుతున్న “సుపరిపాలనలో తొలి అడుగు” వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగిపోతున్నప్పటికీ, స్థానికంగా విభేదాలు బహిరంగమవుతున్నాయి.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, పాలకొండలో కూటమి మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వైసీపీ మాత్రం ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రజల మధ్య తిరుగుతూ “అనవసరంగా జయకృష్ణను గెలిపించారు” అని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒకవైపు టీడీపీ అంతర్గత విభేదాలు, మరోవైపు వైసీపీ దాడులు - రెండింటి మధ్య జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఇరుక్కుపోతున్న స్థితి నెలకొంది. ఇది భవిష్యత్తులో ఎలా మలుపుతీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయంగా పెద్ద ప్రశ్నగా మారింది.