
దీంతో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై పెద్ద దెబ్బ పడింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యలలో 70 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలు రొయ్యల ఉత్పత్తి కేంద్రాలుగా పేరుగాంచాయి. గత మూడు దశాబ్దాలుగా పంట పొలాలను కూడా చెరువులుగా మార్చి రొయ్యల సాగు పెరిగిపోయింది. కిలో రొయ్య ఎగుమతి ధర 270 నుంచి 300 రూపాయల వరకు ఉండేది. కానీ అమెరికా మార్కెట్ మూతబడటంతో ఇప్పుడు రేట్లు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం రైతులు దేశీయ మార్కెట్లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు నష్టాల్లో కూరుకుపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల మంది నేరుగా రొయ్యల సాగుపై ఆధారపడుతుండగా, ప్యాకింగ్, ప్రాసెసింగ్, ఐస్ తయారీ, రవాణా, ఫీడ్ ఉత్పత్తి వంటి అనుబంధ రంగాల్లో మరికొన్ని లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రొయ్యల రైతులను ఆదుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. లేకపోతే రాబోయే రోజుల్లో రొయ్యల సాగు మరింత క్షీణించి, వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రొయ్యల వల్ల ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ట్రంప్ సుంకాల దెబ్బతో తల వంచుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు గట్టిగా కోరుతున్నారు.