
అయితే తాజాగా పరిస్థితులు మారుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఏపీలో సెప్టెంబర్ మూడో వారం నుంచి శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. ఈసారి జగన్ స్వయంగా హాజరుకానున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంపై తన తీవ్ర విమర్శలను సభా వేదికగానే విసరాలని జగన్ సిద్ధమయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు “సభ అవసరం లేదు, బయటే పోరాటం” అనే ధోరణి చూపిన జగన్ ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గారు అన్నది ఆసక్తికర చర్చగా మారింది.
ఇక తెలంగాణలో కూడా ఇదే సన్నివేశం. అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్న వేళ, కేసీఆర్ హాజరవుతారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్‌పై చర్చకు ఆయన సిద్ధమయ్యారట. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు బలమైన సమాధానం ఇవ్వడమే కాకుండా, తమ పాలనలో తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునేందుకు కేసీఆర్ సభను వేదికగా ఎంచుకోనున్నారని సమాచారం. అంతేకాదు, రెండు సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో ప్రజా సమస్యలను ఎండగడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నేరుగా దాడి చేయాలని నిర్ణయించుకున్నారని కూడా అంటున్నారు.
మొత్తానికి, ఒక వైపు జగన్, మరో వైపు కేసీఆర్ – ఇద్దరూ ఒకేసారి తమ తమ రాష్ట్రాల్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం మొదలైంది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మళ్లీ సభలో ప్రత్యక్షమైతే, రాజకీయ వేడి పెరగడం ఖాయం. జగన్ – చంద్రబాబు మధ్య వాగ్వాదం ఏ రేంజ్‌లోనైనా వెళ్లొచ్చు. అలాగే రేవంత్ – కేసీఆర్ మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా మారనుంది. ఇక చూడాలి మరి… ఈసారి సభ వేదికపై జగన్, కేసీఆర్ నిజంగానే హాజరవుతారా..? లేక మళ్లీ అదే “వెళ్తామన్న మాట – కానీ చివరికి గైర్హాజరు” అన్న పంథాను ఎంచుకుంటారా..? ఏది ఏమైనా, అసెంబ్లీ సమావేశాల దిశగా ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల దృష్టి మళ్లింది.