
- అసహజ మరణాలకు కారణాలను అన్వేషించాలి
- ఎయిమ్స్ వంటి అత్యున్నత వైద్య సంస్ధల నిపుణులతో కమిటీ వేయాలి
- వైపిపి హయాంలో మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేయించుకోవాలి
- మృతుల కుటుంబాలకు రూ.10 వేలు లెక్కన ఆర్ధిక సాయం
- తురకపాలెంలో మృతుల కుటుంబాలను పరామర్శించి, గ్రామస్తులకు ధైర్యం చెప్పిన బిసివై అధినేత రామచంద్రయాదవ్
గుంటూరు జిల్లా తురకపాలెంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తురకపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి 10వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన రెండు మూడు నెలలుగా తురకపాలెంలో అసహజ మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మరణించిన వారిలో ఎక్కవ మంది పురుషులే ఉన్నారని, అలాగే చనిపోయిన వారిలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులే ఎక్కువగా ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 1340 మందికి వైద్య పరీక్షలు చేస్తే అందులో 1068 మందికి కిడ్నీ సమస్యలు, 168 మందికి లివర్ సమస్యలు ఉన్నట్టు పరీక్షల్లో తేలిందన్నారు. గ్రామంలో వందలో 70 మందికి ఈ ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటో యుద్ద ప్రాతిపదికన తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తురకపాలెంలో చనిపోయిన వారు సహజ మరణాలుగా కాకుండా వారి కుటుంబాలను మానవతా దృక్పధంతో ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని రామచంద్రయాదవ్ కితాబిచ్చారు.
రాష్ట్రమంతా స్క్రీనింగ్ చేయించాలి
తురకపాలెంలో సంభవించిన అసహజ మరణాల ద్రుష్ట్యా రాష్ట్రంలో కూడా ఒకింత ఆందోళన నెలకొందన్నారు రామచంద్రయాదవ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించాలన్నారు. ఇలాంటి ఘటనలు కేవలం తురకపాలెంకే కాదు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఉందా? అనే అనుమానాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎయిమ్స్ వంటి అత్యున్నత వైద్య విజ్ణాన సంస్థ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి కారణాలను అన్వేషించాలని కోరారు.
వైసిపి హయాంలో కల్తీ మద్యం వల్లేనా? అనే అనుమానం కలుగుతోంది
తురకపాలెంలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో బయటపడిన అనారోగ్య సమస్యలను చూస్తుంటే వైసిపి హయాంలో అమ్మిన కల్తీ మద్యం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండవచ్చనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారని రామచంద్రయాదవ్ తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో మద్యం సేవించిన వారంతా ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ10 వేలు ఆర్థిక సాయం
తురకపాలెంలో పర్యటించిన రామచంద్రయాదవ్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. మ్రుతుల కుటుంబాలకు రూ.10వేలు లెక్కన ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. మధ్య వయస్కులు చనిపోవడంతో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రులలో జాయిన్ అవుతున్న యువకుల వివరాలను ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరారు.