
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం చంద్రబాబు ఆమెకు మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ పదవి దక్కినప్పటి నుంచి సుమారు ఆరు నెలల పాటు శ్రీదేవి పూర్తిగా మౌనంగా ఉండటం, ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో సందేహాలకు దారి తీసింది. కానీ తాజాగా ఆమె జిల్లాల్లో పర్యటించడం, ప్రజలతో కలిసిపోవడం, మళ్లీ యాక్టివ్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల వెనుక కారణం ఏమిటి అన్న దానిపై లోతుగా వెళ్తే, వైసీపీ హయాంలో శ్రీదేవి మీద నమోదైన మూడు కేసులు ప్రధానంగా కనబడుతున్నాయి. ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆమె అనుచరుల్లోనే విభేదాలు ఏర్పడి ఒక వర్గం ఆమెపై కేసులు పెట్టింది. ఎన్నికల సమయంలో తమ నుంచి డబ్బులు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించారన్న ఆరోపణలు ఆ కేసులలో ఉన్నాయి.
దీంతో ఆ సమయంలో శ్రీదేవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన ఆమెకు కేసులు బరువై, రాజకీయంగా ముందుకు సాగే అవకాశం లేకుండా చేశాయి. ఇప్పుడు ఈ కేసులు వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొనడంతో శ్రీదేవి ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్లుగా తలనొప్పిగా మారిన ఈ కేసులు తీరిపోవడంతో ఆమె మళ్లీ రాజకీయంగా ముందుకు రావడానికి ధైర్యం చేసిందని టిడిపి వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వైసీపీ నాయకులు ఈ కేసులపై కౌంటర్ అఫిడవిట్ వేస్తారా? లేక పూర్తిగా వెనక్కి తగ్గుతారా? అన్నది. తాడేపల్లి వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, పార్టీ అధిష్టానం శ్రీదేవి విషయంలో పెద్దగా ముందుకు వెళ్లే అవకాశాలు లేవు. ఆమెపై ఉన్న కేసులు ఇక్కడితో ఆగిపోతాయని టిడిపిలో నమ్మకం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలే ఉండవల్లి శ్రీదేవిని మళ్లీ యాక్టివ్‌గా మారేలా చేశాయంటున్నారు.