
మీరందరూ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు. కానీ, ఆ పార్టీ విధానాలతో విభేదించి ఆ పార్టీపై తిరుగుబాటు చేసి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఆ పార్టీకి కంట్లో నలుసుగా కూడా మారారు. ఇలా ఇప్పుడు ఈ విషయం వైసిపి లోను చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తాను అసెంబ్లీకి వెళ్లకపోగా, వెళ్లే వారిని కూడా అడగించటం వల్ల జగన్ పై అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత అయితే పెరుగుతోంది. అలాగని ఆయనను విభేదించే పరిస్థితి లేదని పైకి చెబుతున్నప్పటికీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నాయకులు తీసుకునే నిర్ణయాలు చిత్రంగాను విచిత్రంగానే ఉంటాయి.
ఈ క్రమంలో వైసీపీలో కూడా తిరుగుబాటు ఎదురైతే ఆపే పరిస్థితి ఉండదన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. ఎంత పిల్లి అయినా నాలుగు గోడల మధ్య బంధించి కొడితే తిరగబడే పరిస్థితి ఉంటుంది. అలానే, ఎంత వినయం, ఎంత మర్యాద ఉన్నప్పటికీ జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసిపి ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ``మీరు సభకు వెళ్లకపోయినా చెల్లుబాటవుతుంది. మీకున్న ఇమేజ్ మాకు లేదు. రేపు మళ్లీ మేము గెలవాలి అంటే ప్రజల మధ్యకి ఉండాలి. ప్రజల మధ్యకి వెళ్ళాలి. ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. నియోజకవర్గంలో పర్యటించాలి. కానీ, అసలు సభకి వెళ్లకుండా నియోజకవర్గంలోకి వెళ్తే ఏ మొహం పెట్టుకొని వచ్చారని ప్రశ్నిస్తున్న పరిస్థితి మాకు ఎదురవుతుంది.`` అని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ అసహనాన్ని గమనించే జగన్ రెండు రోజుల కిందట మీరు వెళ్తే వెళ్ళండి అని ముక్తసరిగా వ్యాఖ్యానించారు.
కానీ, అంతర్గతంగా మాత్రం అలా ఎవరైనా వెళ్తే కనుక సీరియస్ యాక్షన్ ఉంటుందన్న సంకేతాలు కూడా దిగువ స్థాయి నాయకులు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఇరకాటంలో పడిపోయారు. ఈ పరిణామాల క్రమంలోనే ఎవరైనా బలమైన నాయకుడు కనుక నిలబడి పార్టీలో చీలిక తీసుకువస్తే ఖచ్చితంగా తిరుగుబాటు చేసేందుకు ఆరుగురు నుంచి 8 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. ఎప్పుడూ పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి నాయకులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఒకప్పుడు జగన్ తప్పు నాకు దిక్కు లేదని చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వదిలేసి బయటికి వచ్చేసారు. జగన్తోనే తన జీవితం ముడిపడి ఉందన్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్లే పార్టీకి రాజీనామా చేసి తిరుగుబాటు జెండా ఎగరేశారు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. నాయకులు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈ విషయాన్ని వైసిపి అధినేత గుర్తించాలి. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని వారికి స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.