ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను బీభత్సం చూపింది. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో చెట్లు, వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు కూలిపోగా... అత్యంత దారుణంగా దెబ్బతిన్నది మాత్రం అన్నదాత ఆశలు! ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండానే నేలపాలైంది. 243 మండలాల్లో పంట నష్టం తీవ్రత అంచనాలకు మించి ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు దాదాపు 22 జిల్లాల్లోని రైతులపై మొంథా తీవ్ర ప్రభావం చూపింది. పత్తి, మిరప, కంది, వేరుశనగ వంటి వాణిజ్య పంటలు, అరటి, బొప్పాయి, బత్తాయి వంటి తోటలు పూర్తిగా ఈదురు గాలులకు ధ్వంసమయ్యాయి. పచ్చని తోటలు క్షణాల్లో విరిగిపడి, నల్లటి మట్టిలో కలిసిపోయాయి.
 

చేతికొచ్చే దశలో వరి సాగుకు గండం! .. తుపానుతో అత్యంత ఎక్కువగా నష్టపోయిన రైతులు వరి సాగుదారులు. డెల్టా ప్రాంతంలో సాగవుతున్న వరి పంట సరిగ్గా కంకులేసి, మరో పది నుంచి పదిహేను రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న దశలో భారీ వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఆశగా నిలబడిన పంట నేలకొరిగింది. ధాన్యం తడిసి ముద్దవ్వడంతో మొలకలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. కళ్లెదుటే వేల హెక్టార్లలో తమ శ్రమ నాశనం కావడం చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెట్టుబడి కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వరకూ ఇదే హృదయ విదారక పరిస్థితి కనిపిస్తోంది.
 

నష్టపరిహారం: నామమాత్రమేనా? .. పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరి నిలిచిపోవడంతో పంట పూర్తిగా నాశనమైనట్లేనని రైతులు విలపిస్తున్నారు. ఒక్కో ఎకరాకు సుమారు ముప్ఫై నుంచి నలభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోలుకోలేని పరిస్థితి ఏర్పడటంతో అన్నదాతలు భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ప్రాథమికంగా వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఈ భారీ నష్టాన్ని ఏమాత్రం పూడ్చలేదన్నది మాత్రం చేదు వాస్తవం. నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. ప్రకృతి విపత్తుల నుంచి అన్నదాతను ఆదుకోవడానికి మరింత సమగ్రమైన విధానం అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: