
నటి సావిత్రి నాట్యానికే పరిమితమైన ఆరోజుల్లో తను రచించిన ‘బలిదానం’ అనే నాటకం ద్వారా రంగస్థలనటిగా మార్చిన ఘనత జగ్గయ్యకు దక్కుతుంది. జగ్గయ్య దాదాపు వందసినిమాల్లో హీరోగా నటించారు. మరో వంద సినిమాల్లో సహకథానాయకుడిగా నటించారు. రెండువందల చిత్రాల్లో క్యారక్టర్ నటుడుగా రాణించారు. ఆరోజుల్లో అగ్రశ్రేణి నటులు ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర రంగంలో దూసుకుపోతుండగా జగ్గయ్య మాత్రం తనదైన శైలిలో, స్థిరమైన వేగంతో నటజీవితాన్ని సాగించారు. ఎక్కువగా నాగేశ్వరరావు చిత్రాల్లో సహ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించారు. ఆయన ఏ హేరో ప్రక్కన నటించినా హీరోకన్నా జగ్గయ్యకే ఎక్కువ పేరువచ్చేది. నాగేశ్వరరావు-సావిత్రి-జగ్గయ్య కలిసి నటించిన చిత్రాలు బాగా విజయవంతమయ్యాయి.
నోబెల్ పురస్కారము అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీతా అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం. రవీంద్రనాథ ఠాగూరు రాసిన నాటకం సాక్రిఫైస్ ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించాడు. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్తో సత్కరించింది. ఢిల్లీ లోని సంస్కృత విశ్వవిద్యాలయం కళా వాచస్పతి అనే బిరుదుతో జగ్గయ్యను సత్కరించింది. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదు నిచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు అనే సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 50,000 రూపాయల ప్రోత్సాహకం లభించింది.2004, మార్చి 5 న 76 సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో జగ్గయ్య మరణించాడు.