హిందువులు ఆరాధించ‌బడే దేవుళ్ల‌లో శ్రీకృష్ణుడు ఒక‌డు. విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ రోజే కృష్ణాష్ట‌మిని జ‌రుపుకుంటారు. కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. అష్టమిలో పుట్టిన ఈ చిన్ని‌ కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. అష్టమి తిధి మంచిది కాదు అనే అభిప్రాయాన్ని పోగొట్టడానికే శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథిలో రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించాడు మ‌న క‌ట్ట‌య్య‌.

అయితే మ‌రి కన్నయ్యకు ఇది ఎన్నో జన్మదినమో తెలుసా..? దృక్‌పంచాంగం ప్రకారం... ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అంటే ఐదు వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు లెక్క. ఇక ఈ ఏడాది ఆగస్టు 11 ఉదయం 9.07 గంటల నుంచి ఆగస్టు 12 ఉదయం 11.16 గంటల వరకు అష్టమి తిథి కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో మనం కృష్ణుడిని ఆరాధించడం శుభసూచకం. ఈ రోజు చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. ఇక కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి.. శ్రీకృష్ణుని పూజించాలి.

శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే శ్రీకృష్ణుడికి తులసీ దళాలంటే చాలా ఇష్టం. కాబట్టి శ్రీకృష్ణుని తులసి మాలను మెడలో వేయాలి. స్వామికి సంబంధించి అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీ కృష్ణ సహస్రనామాలు, భాగవతంలోని దశమస్కందం చదవాలి. పువ్వులను, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడాలి. ఇక కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి.. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: