రామబంటు హనుమ జన్మస్థానం కొన్నాళ్లుగా చర్చనీయాంశం అవుతోంది. హనుమంతుడు ఝార్ఖండ్‌లో జన్మించారని స్వామి గోపాలనంద బాబా అనే ఆయన కొన్నాళ్లుగా వాదిస్తున్నారు. అబ్బే.. ఆంజనేయుడు మా హంపీలోని కిష్కింధ కొండ వద్ద జన్మించాడని మరో స్వామీజీ గోవిందానంద సరస్వతి ప్రచారం చేస్తున్నారు. అందుకు సాక్ష్యాధారంగా అక్కడ నెలకొల్పిన హనుమంతుని విగ్రహాన్ని సాక్ష్యంగా చూపుతున్నారు. ఇలా హనుమంతుడి జన్మస్థలంపై వివాదం నెలకొంది.

అయితే.. హనుమంతుని జన్మస్థలం ఇవేవీ కాదు.. ఆంధ్రదేశమే అని నిరూపిస్తున్నారు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమత్‌ ఉపాసకుడు డాక్టర్‌ అన్నదానం చిదంబర శాస్త్రి. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఈ అంశంపై పరిశోధన చేశారు. పలు పురాణాలు, గ్రంథాలను అధ్యయనం చేసి కొన్ని ఆధారాలను సేకరించారు. అంతే కాదు..  హనుమంతుడి జీవితంపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కూడా చేశారు. హనుమచ్చరిత్రకు ప్రామాణికమైన శ్రీపరాశర సంహితనూ ఆధారం చేసుకున్నారు. ఇవే కాకుండా  భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణాలు  కూడా  పరిశోధించారు.

వీటనిటి ప్రకారం హనుమంతుడు పుట్టింది తిరుమల అంజనాద్రిలోనేనని పురాణ ప్రమాణాలతో చిదంబర శాస్త్రి వివరిస్తున్నారు. ఈయన కృషి కారణంగానే ఇప్పుడు టీటీడీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఓ కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించింది. చిదంబర శాస్త్రి కృషి కారణంగానే ఇప్పుడు హనుమంతుడు తెలుగువాడేనని, ఆయన జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని తగిన ఆధారాలతో శ్రీరామనవమినాడు ప్రకటించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

హనుమంతుడు తెలుగువాడని తిరుమల అంజనాద్రిపైనే జన్మించాడని నిరూపించడం నా జీవితాశయం  అంటున్నారు చిదంబర శాస్త్రి. తాను ఇందుకోసం దశాబ్దాలుగా పోరాడుతున్నానని... ఇన్నాళ్లకు కల నెరవేరబోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాపాలీ తీర్థంలో భవ్యమందిర నిర్మాణం చేపట్టాలనేది తన ఆశయంగా ఆయన చెబుతున్నారు. హనుమంతుడి జన్మస్థలం గురించి గతంలో  ప్రముఖ చరిత్రకారుడు కొమర్రాజు లక్ష్మణరావు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి కూడా చెప్పారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: