భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటే తాజాగా అతని రికార్డు ఒకటి కనమరుగైంది. అది కూడా కోహ్లికి చెందిన 10 ఏళ్ల నాటి రికార్డును యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ బద్ధలు కొట్టాడు. దేవధార్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-బితో జరిగిన ఫైనల్లో భారత్‌-సి మ్యాచ్‌కు శుభ్‌మన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దాంతో దేవధార్‌ ట్రోఫీ ఫైనల్లో పిన్నవయసులో ఒక జట్టుకు సారథిగా చేసిన రికార్డును శుభ్‌మన్‌ తన పేరిట లిఖించుకున్నాడు. 


ప్రస్తుతం శుభ్‌మన్‌ 20 ఏళ్ల 50  రోజుల వయసులో దేవధార్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌కు కెప్టెన్‌గా చేయగా, కోహ్లి 21 ఏళ్ల 142 రోజుల వయసులో సారథిగా చేశాడు. 2009-10 సీజన్‌లో దేవధార్‌ ట్రోఫీ ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదే ఇప్పటివరకూ దేవధార్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌కు పిన్నవయసులో కెప్టెన్‌గా చేసిన రికార్డు కాగా, దాన్ని శుభ్‌మన్‌ బ్రేక్‌ చేయడం జరిగింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన భారత్‌-సి ఓటమి పాలైంది. 


తాజాగా  జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  భారత్‌-బి 283 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌(54), కేదార్‌ జాదవ్‌(86)లు హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. చివర్లో విజయ్‌ శంకర్‌ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అనంతరం భారత్‌-సి  50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులకే పరిమితమైంది.

భారత్‌-సి జట్టులో ప్రియామ్‌ గార్గ్‌(74) అర్థ శతకం సాధించగా, అక్షర్‌ పటేల్‌(38), జయజ్‌సక్సేనా(37), మయాంక్‌ మార్కండే(27)లు మోస్తరుగా ఆడారు. గిల్‌(1) నిరాశపరిచాడు. దాంతో 51 పరుగుల తేడాతో భారత్‌-సి ఓటమి పాలుకాగా, పార్థీవ్‌ పటేల్‌ నేతృత్వంలోని భారత్‌-బి టైటిల్‌ ను కైవసం చేసుకుంది. శుభ్‌మన్‌ ఒక మంచి కెప్టెన్‌గా మంచి పేరు దక్కించు కున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: