టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ చేస్తూ మరోసారి గాయపడ్డాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఆడిన షాట్‌ని ఆపే క్రమంలో ధావన్ ఎడమ భుజానికి గాయమైంది. గాయం నొప్పి ఎక్కువగా ఉండటంతో ధావన్ ఫీల్డింగ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతడు బదులు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా చహల్ ఫీల్డింగ్ చేశాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కూడా ధావన్‌కు గాయమైంది.

 

ఇక ఈరోజు జరిగిన మ్యాచ్‌లో కూడా మరోసారి గాయపడిన ధావన్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడిన ధావన్ బ్యాటింగ్ సేవలు ఈ మ్యాచ్‌లో ఇండియా కోల్పోతే కొంత ఇబ్బందికర పరిస్తితి రావోచ్చు. కాకపోతే ప్రస్తుతం ఉన్న బ్యాట్స్‌మెన్స్‌తోనే మ్యాచ్ ఫినిష్ చేస్తే బాగానే ఉంటుంది. లేదంటే ధావన్ లేని లోటు మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

ఇదిలా ఉంటే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (132 బంతుల్లో 131: 14 ఫోర్లు, 1 సిక్స్‌)తో అదరగొట్టాడు. మార్నస్‌ లబుషేన్‌(54) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ 4 వికెట్లతో రాణించగా.. జడేజా 2, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ తలో వికెట్‌ పడగొట్టారు.

 

ఇక 287 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ప్రస్తుతం 11 ఓవర్లలో 64/0 పరుగులు చేసింది. ధావన్ గాయపడటంతో రోహిత్‌కు జోడీగా కే‌ఎల్ రాహుల్ వచ్చాడు. ప్రస్తుతం రోహిత్ 42, రాహుల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, మూడు వన్డేల సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ నెగ్గి సిరీస్ 1-1తో నిలిచాయి. మరి ఈ మ్యాచ్ గెలిచి, సిరీస్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: