ఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు మనం ఒకటి మాట్లాడబోతే ఇంకేదో జరుగుతుంది. పరిస్థితి తారుమారవుతుంది. కొద్ది సేపటికి అసలు విషయం తెలుసుకుని సరిదిద్దుకున్నా అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయి ఉంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నాడు టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్. టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, టీవీ ప్రెజెంటర్‌ సంజనా గణేషన్‌ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఒక్కటైన విషయం తెలిసిందే.

వీరి వివాహం సోమవారం గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో పె‍ళ్లికి సంబంధించిన ఫోటోలను బుమ్రా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ ఫోటోలను చూసిన మయాంక్‌ అగర్వాల్‌.. బుమ్రా, సంజనలకు కంగ్రాట్స్‌ చెబుతూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్‌లో మయాంక్ చేసిన ఓ తప్పుతో క్రికెట్ ఫాన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
             
మయాంక్ తన ట్వీట్‌లో బుమ్రా భార్య సంజన పేరుకు బదులుగా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు. ''కంగ్రాట్స్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. సంజయ్‌ బంగర్‌.. మీ వైవాహిక జీవితం బాగుండాలని.. కలకాలం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అంటూ కామెంట్‌ చేశాడు. మయాంక్‌ చేసిన పని నెటిజన్లకు మొదట అర్థం కాకపోయినా.. ఆ తరువాత విషయం తెలిసి తెగ నవ్వుకుంటున్నారు.

‘అయ్యో మయాంక్‌.. బుమ్రా భార్య పేరు సంజన, సంజయ్‌ బంగర్‌ కాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. మరో నెటిజన్..‘ఇప్పుడే బుమ్రా.. సంజనను పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ సంజయ్ బంగర్‌తో పెళ్లంటే కష్టం’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. కొంత సేపటికి మయాంక్‌ తాను చేసిన తప్పును తెలుసుకుని.. ఆ ట్వీట్‌ను చూసుకొని వెంటనే దానిని డిలీట్‌ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అందుకే ట్వీట్‌లు చేసేటప్పుడు కొంత ఆలోచించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: