ఇండియా వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇక భారత జట్టులో సీనియర్ క్రికెటర్లుగా కొనసాగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ల గురించి ఒక విషయం తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్న ఈ సీనియర్ క్రికెటర్లు మళ్లీ టి20 ఫార్మాట్ లోకి వస్తారా లేదా అనే విషయం పైన అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2024 లో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ టి20 కెప్టెన్సీ చేపడతాడా లేదంటే తాత్కాలిక కెప్టెన్ అయిన హార్దిక్ నే పూర్తిస్థాయి కెప్టెన్గా అవతరిస్తాడా అన్నది ప్రస్తుతం అందరిలో ఉన్న ఒక ప్రశ్న.


 అయితే ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ తో బిసిసిఐ సుదీర్ఘమైన సమావేశం నిర్వహించింది అన్నది తెలుస్తుంది. అయితే వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రదర్శనతో పాటు భవిష్యత్తు కార్యాచరణ పై కూడా ఈ సమావేశంలో చర్చించారట. 2024 t20 వరల్డ్ కప్ సహా మరిన్ని విషయాలపై ఇక ఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలోని దక్షిణాఫ్రికా పర్యటన కోసం మూడు ఫార్మాట్లకు సంబంధించిన జట్టును కూడా సెలెక్ట్ చేసింది బిసిసిఐ. ఈ క్రమంలోని రోహిత్ శర్మ ఈ సమావేశంలో ఏకంగా బీసీసీఐ పెద్దలను ఒక విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు సమాచారం.


 2024 t20 ప్రపంచ కప్ టోర్నీ కోసం తననూ సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారా లేదా అని భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ నేరుగానే ప్రశ్నించాడట. తనకు ఈ విషయాన్ని త్వరగా చెప్పాలి అంటూ డిమాండ్ చేశాడట. ఒకవేళ t20 ప్రపంచ కప్ కోసం నన్ను తీసుకోవాలనుకుంటే ఎలా ముందుకు సాగాలి అనే విషయంపై ఇప్పటి నుంచే ప్రస్తుత ఇవ్వాలని బీసీసీఐ అధికారులను రోహిత్ శర్మ కోరినట్లు సమాచారం. అయితే 2024 t20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉండాలని బీసీసీఐ అధికారులతో పాటు కోచ్ ద్రావిడ్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: