ప్రముఖ మెసెంజర్ అప్లికేషన్ వాట్సాప్ తరచూ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తెస్తోంది. తాజాగా "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాక్‌అప్స్" ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ సంస్థ సిద్ధమయ్యింది. సాధారణంగా వినియోగదారులు తమ చాట్ డేటాను ఐక్లౌడ్‌, గూగుల్‌ డ్రైవ్‌లో బ్యాక్‌అప్ చేస్తుంటారు. కానీ ఈ బ్యాక్‌అప్ డేటాకి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ప్రైవసీ ఉండదు. దీనివల్ల హ్యాకర్లు బ్యాక్‌అప్ డేటాలోని సమాచారాన్ని తెలుసుకునే ప్రమాదం ఉంది. అయితే ఈ ప్రమాదం తమ వినియోగదారులకు ఎదురు కాకూడదన్న లక్ష్యంతో "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాక్‌అప్స్" ఫీచర్ ని వాట్సాప్ సంస్థ రోల్ అవుట్ చేయబోతుంది.

వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ అయిన వాబీటాఇన్ఫో (WABetaInfo) లో "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాక్‌అప్స్" ఆప్షన్ కి సంబంధించిన రెండు స్క్రీన్‌షాట్స్ దర్శనమిచ్చాయి. 'గూగుల్‌ డ్రైవ్‌లో బ్యాక్‌అప్ చేసే మీ వాట్సాప్ మెసేజ్ హిస్టరీ, డేటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాక్‌అప్స్ ఆప్షన్ తో భద్రపరుచుకోండి' అని మొదటి స్క్రీన్ షాట్ లో కనిపించింది. ఇంకొక స్క్రీన్ షాట్ లో వాట్సాప్ బ్యాక్‌అప్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ తో భద్రపరుస్తారా లేదా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ డిసేబుల్ చేస్తారా అనే ఆప్షన్ కనిపించింది. బ్యాక్‌అప్ చేసిన డేటా స్టేటస్ తెలుసుకునేందుకు వీలుగా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది.

ఐతే డేటా ఎన్‌క్రిప్ట్ చేసేముందు వినియోగదారులు ఒక పర్సలన్ పాస్ వర్డ్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తేనే డేటా డిక్రీప్ట్ అవుతుంది. దీనివల్ల వినియోగదారులు మాత్రమే తాము ఎన్‌క్రిప్ట్ చేసిన వాట్సాప్ బ్యాక్‌అప్ ను యాక్సెస్ చేయడానికి వీలు ఉంటుంది. ఇతరులు ఎవరూ కూడా వారి డేటాను అసలు చూడలేరు.

ఐతే ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉండగా.. భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ఆండ్రాయిడ్ వెర్షన్ అప్ డేట్ లో ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ సంస్థ చెబుతోంది. ఈ ఫీచర్ లో ఏమైనా లోపాలు ఉన్నాయో లేవో గుర్తించి.. ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించి ఆపై రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే వినియోగదారుల బ్యాక్‌అప్ డేటాను వాట్సాప్, ఫేసుబుక్ అప్లికేషన్లు యాక్సెస్ చేయలేవని ఈ సందర్భంగా వాట్సాప్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: