ఈ ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడని అంటుంటారు. కానీ ఆ దేవుడు కూడా ఒక స్త్రీ కడుపునే పుట్టాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు. ఈ సృష్టిలో అపురూపమైనది స్త్రీ. ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం అనిర్వచనీయమైన ఆనందానికి చిరునామాగా ఆమె నిలుస్తుంది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఒక స్త్రీ వేరొకరికి జన్మనిచ్చే సమయంలో ఎంతో నొప్పిని అనుభవిస్తుంది. ఈ సమయంలో తప్పకుండా ఎవరో ఒకరి సహాయం అయితే ఆమెకు అవసరమవుతుంది. పూర్వం పురుడు అంటే ఇంట్లోనే పోసేవారు. కానీ నాగరికతలో భాగంగా ప్రస్తుతం పురుడు అంటే ఆసుపత్రిలో వైద్యులు పోస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గర్భిణీలు మళ్లీ ఇంటి నుంచే ప్రసవించడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లోని అన్ని ఆసుపత్రులు కూడా కరోనా సెంటర్లుగా మారిపోయాయి. వైద్యులంతా కరోనా పేషంట్లకు చికిత్స అందించడంలోనే నిమగ్నమైపోయారు.

ఈ కారణంగా కరోనా సమయంలో ప్రసవించడానికి సిద్దంగా ఉన్న అనేక మంది గర్భిణీలకు ఆసుపత్రులు దొరకలేదు. అంతేకాకుండా కొంత మంది మహిళలు ఆసుపత్రికి వెళ్తే తనతో పాటు తనకు పుట్టబోయే బిడ్డకు కూడా కరోనా సోకుతుందేమో అన్న భయం ఏర్పడింది. ఇలా కరోనా కారణంగా ప్రసవించడానికి సిద్దంగా ఉన్న అనేక మంది మహిళలు ఇంటి నుంచి అడుగు బయట పెట్టేందుకు భయపడ్డారు. ఒక్క యూకే విషయానికి వస్తే ఒకే నెలలో దాదాపు 2 వేల మంది గర్భిణీలు ఇంట్లోనే వైద్యులు కూడా లేకుండా పురుడు పోసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇన్ని వేల మంది ఆసుపత్రికి వెళ్లకుండా, వైద్యుడు దగ్గర లేకుండా ఇంట్లోనే పురుడు పోసుకున్నారంటే నిజంగా అది రికార్డ్ అని చెప్పాలి. పైగా కరోనా కారణంగా పురుడు పోసే వారు కూడా కరువయ్యారు.

అయినప్పటికి పురుడు పోసే వారు లేకపోయినా, వైద్యులు లేకపోయినా వీడియో కాల్స్ సహాయంతోనే అనేక మంది మహిళలు ఎంతో ధైర్యంతో మరో జీవికి జన్మనిచ్చారు. బిడ్డకు జన్మనిచ్చిన చాలా మంది మహిళలు చెబుతున్నది ఏంటంటే.. తాను ఆసుపత్రికి వెళ్లి ఉంటే కచ్చితంగా సీ సెక్షన్ చేసే వారని.. కానీ ఇంట్లో మాత్రం ధైర్యంగా నార్మల్ డెలివరీ అయిపోయిందని చెప్పారు. దీని బట్టి చూస్తుంటే డాక్టర్ లేని డెలివరీనే బెటర్ ఆప్షన్ అని అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: