ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలపై చర్చ మళ్లీ మొదలైంది.. ఎప్పటికప్పుడు ఏపీలో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికలు వాటికి సంబంధించిన చర్చ మళ్లీ కాకరేపుతోంది. ఏపీలో స్థానిక ఎన్నికల పై జరిగిన వివాదం అంతా ఇంతా కాదు. స్థానిక ఎన్నికల వివాదం వైసీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మధ్య ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది... కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల గురించి ఇప్పట్లో ఆ ఆలోచన చేయకుంటేనే మంచిదని అధికారపక్షం వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రేపు అన్ని పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జరిపే సమావేశానికి అధికార పార్టీ హాజరవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమై సమయంలో కరోనా విజృంభణ కారణంగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిరవధికంగా వాయిదా వేశారు. అన్‌లాక్‌ ద్వారా కేంద్రం అన్నిటికీ అనుమతులు ఇస్తున్న తరుణంలో ఎన్నికలను కూడా జరపొచ్చన్న కారణంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకెళ్తున్నారు. అయితే, కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉందని, అలాంటప్పుడు ఎన్నికలు ఎలా జరిపిస్తారు అన్న ప్రశ్నను అధికార పార్టీ నేతలు లేవనెత్తుతున్నారు. ఒకవేళ మిగిలిన పార్టీలు సమావేశానికి హాజరైతే ఎలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది వేచిచూడాలి.మరోవైపు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నింటికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనున్న ఈ సమావేశానికి.. ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి మాత్రమే రావాలని ఈసీ సూచించారు. ఇక, అటు టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరువుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. మిగిలిన పార్టీల తరపున కూడా ప్రతినిధులు వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ఏకగ్రీవాలు అన్ని రద్దు చేయాలని టీడీపీ సహా అన్ని విపక్షాలు కోరుతున్నాయి. మరి అధికారపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: