ప్రపంచ కర్మాగారం అని చెప్పుకునే చైనా కథ కీలకమైన మలుపు తిరిగిందా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పెత్తనం చెలాయిస్తున్న ఆ దేశానికి బ్రేకులు పడనున్నాయా అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు గృహ సంక్షోభం కూడా ఆందోళన కర స్థాయికి చేరుకొంది.


ఎంతలా  అంటే అక్కడ జనాభా కన్నా ఇళ్లే అధికంగా ఉన్నాయంటున్నారు. లక్షల సంఖ్యలో ఖాళీ గృహాలు దర్శనమిచ్చే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు చైనా రియల్ ఎస్టేట్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వెన్నెముకగా  ఉండేది. 2021లో ఎవర్ గ్రాండ్ సంక్షోభంలో పడిన దగ్గర నుంచి ఈ రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. అనంతరం కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.


ప్రస్తుతం చైనా రియల్ ఎస్టేట్ రంగం ఆశాజనకంగా లేదు. డెవలపర్ సంస్థలు ప్రాజెక్టుల కోసం విపరీతంగా అప్పులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ లో సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జినిపింగ్ ఇళ్లు నివసించడానికే కానీ ఊహలకు కాదు అంటూ తాను నమ్మే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. ఫలితంగా తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రధాన సంస్థల దగ్గర నిధులు లేని పరిస్థితి ఏర్పడింది.


ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఎవర్ గ్రాండ్ పై ఈ వారం హాంగాంక్  న్యాయస్థానంలో వాదలను జరిగాయి. వాదనల తర్వాత రుణదాతలకు అప్పులు తిగిరి చెల్లించే విషయంపై ప్రణాళికలు చెప్పేందుకు ఆరు వారాల సమయం ఇచ్చింది న్యాయస్థానం. దీంతో పాటు కంట్రీ గార్డెన్ కూడా  200 మిలియన్ డాలర్ల అప్పుల్లో ఉంది. ప్రస్తుతం చైనాలో వందలకొద్దీ ప్రాజెక్టుల భవితవ్యం చైనా ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. అయితే చైనా ఎంతమేరకు సాయం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: