రాజ‌కీయాల్లో రాముడు- కొన్ని ద‌శాబ్దాలుగా ఈ దేశంలో కామ‌న్ అయిపోయాడు. దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. రాముడి ప్ర‌స్థావ‌న లేకుండా ముగిసే ప‌రిస్థితి లేకుండా పోయింది. అంతేకాదు.. మ‌న నాయ‌కులు `రామ‌రాజ్యం స్థాపిస్తాం` అంటూ ఢంకా భ‌జాయించి మ‌రీ చెబుతుంటారు. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కూడా రాజ‌కీయాల్లో అత్యంత సానుభూతి, సానుకూల ఓట్లు పొందాలంటే.. ఓ వ‌ర్గాన్ని పూర్తిగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలంటే.. రాముడి స్మ‌ర‌ణ‌.. స్పృశించాల్సిందే! దేశంలో అయోధ్య విష‌యం.. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల‌ను ప‌ట్టి కుదిపేసింది. 


అదేస‌మ‌యంలో త‌మిళ‌నాడు ద‌గ్గ‌ర ఉన్న స‌ముద్రంలోనూ సేతువుపై రాజ‌కీయం అంతా ఇంతా కాదు. సీతాన్వేష‌ణ స‌మ‌యంలో లంకా న‌గ‌రానికి వెళ్లేందుకు రాముడు త‌న వాన‌ర సైన్యం సాయంతో స‌ముద్రంపై నిర్మించిన వార‌ధి ఉంద‌ని కొంద‌రు.. లేద‌ని.. ఇంకొంద‌రు.. ఆ వార‌ధికి న‌ష్టం రాకుండా నిర్మాణాలు చేప‌డ‌తామ‌ని బీజేపీ పెద్ద‌లు.. ఇలా అనేక రూపాల్లో దేశంలో రాముడు వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగానే మారారు. అయోధ్య రామమందిర నిర్మాణం విష‌యం ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చోటు సంపాయించుకున్న‌దంటే.. రాముడి సెంటిమెంటు ఎలా ఉందో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. 


హిందువుల దైనందిన జీవితంలో నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో రామ‌నామ స్మ‌ర‌ణ ఓ భాగం. అలాంటి రాముడు చుట్టూ.. అల్లుకోని రాజ‌కీయం అంటూ ఏమీ లేదు. ఓట్లు-సీట్ల రాజ‌కీయంతోపాటు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ర‌గ‌డ‌ల‌కు కూడా రాముడిని వాడుకున్న ప‌రిస్థితి నిన్న మొన్న‌టి వ‌ర‌కు మ‌నం చూశాం. ఇక‌, ఇప్పుడు మ‌న వీక్‌నెస్ రాముడేన‌ని గుర్తించిన పొరుగు రాష్ట్రం నేపాల్ కూడా రాముడి కేంద్రంగా రాజ‌కీయాలు, స‌రిహ‌ద్దు వివాదాల‌ను రెచ్చ‌గొడుతుండ‌డం గ‌మ‌నార్హం.  శ్రీరాముడు అసలు భారతీయుడే కాదని.. నేపాల్ దేశానికి చెందిన రాజు అని.. భారత్‌లో వివాదాస్పద అయోధ్య ఉంటే.. వాస్తవ అయోధ్య నేపాల్‌లో ఉందని.. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన  వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి.

 

కొన్నేళ్లుగా చైనాతో పెనవేసుకున్న నేపాల్ బంధాలు, గత ఏడాది నుంచి ఏదోక విధంగా భారత్‌ను కవ్విస్తోంది. ఓలి చేసిన తాజా వ్యాఖ్యలు ఏదో ప‌నీపాటా లేకుండా చేసిన కావని.. భారత్‌ను ఇరుకున పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గొంతుక మాత్రమే ఓలిదని, మాటలన్నీ చైనావేనని చెబుతున్నారు. భారతీయ, నేపాలీ హిందువులిద్దరికీ శ్రీరాముడు ఆరాధ్యదైవమే! ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో ఉన్నట్లే..నేపాల్‌లో కూడా ఒక అయోధ్య ఉంది. బీహార్‌లో ఉన్నట్లే అక్కడ కూడా ఒక వాల్మీకి ఆశ్రమం ఉంది. సీత జన్మస్థలం నేపాల్‌లోని జనకపురి అని చాలా మంది హిందువుల విశ్వాసం.


ఈ నేప‌థ్యంలోనే నేపాల్ ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం పెరిగింది. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌ను ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కానీ ఖండించ‌లేదు. అంతేకాదు, అస‌లు ఈ మాట త‌మ చెవిన ప‌డిన‌ట్టుగా కూడా భావించ‌లేదు. ఈ ప‌రిణామాలు నిజంగానే ఏదో ఆశించి చేస్తున్న ప‌రిణామాలుగా చూడాల్సి ఉంటుంది. రాముడు దేవుడా?  లేక‌.. ఓ దేశానికి చెందిన పౌర‌డా? అనే విష‌యాన్ని పురాణాలు బాగానే చెప్పాయి. కానీ,  నేత‌లే ఆయ‌న‌ను అర్ధం చేసుకోవ‌డంలోను, ఆయ‌న‌ను అన్వ‌యించుకోవ‌డంలోనూ త‌డ‌బ‌డుతున్నారు. ఇప్పుడు ఇది దేశాల స‌రిహ‌ద్దు వివాదాల వ‌ర‌కు వెళ్లింది. హిందువుల సున్నిత సెంటిమెంట్‌ను రెచ్చ‌గొట్టి రాజ‌కీయ కాక పుట్టించి దేశంలో అల‌జ‌డుల‌కు ప్లాన్ చేసే ప‌రిస్థితి వ‌ర‌కు వెళ్లింది. ఈ ప‌రిణామాన్ని ఆ రాముడే అంతం చేయాలో.. ఈ దేశ అధినేత‌లే ప‌రిష్క‌రించాలో.. చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: