
ముఖ్యమంత్రి జగన్ మోకాళ్లపై కూర్చొని పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్నట్లు ఫ్లెక్సీల్లో ఉంది. పల్లకీ మీద చంద్రబాబు, లోకేశ్ ఉండగా, ఆ పల్లకీని మోస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఉన్న ఫ్లెక్సీని పెట్టారు. దీంతో జనసేన కార్యకర్తలకు చిర్రెత్తు కొచ్చింది. 24 గంటల లోపు ఈ ఫ్లెక్సీలను తొలగించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. తాము కూడా జగన్ గురించి ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలి లో జనసేన నేతలు మాట్లాడుతూ.. ఎవరైతే ప్లెక్సీలు పెట్టారో వారితోనే వెంటనే తీసేయించాలని పోలీసులను కోరారు. లేకపోతే మేం కూడా అలాంటి ఫ్లెక్సీలే పెడతామని పోలీసులతో చెప్పారు.
మరో వైపు వైసీపీ కి వ్యతిరేకంగా విశాఖ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. దీన్ని రాత్రికి రాత్రే ఎవరో తొలగించారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు సత్యం కూడలిలో ధర్నాకు దిగారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్ ఒక పోస్టు చేశారు. జగన్ ను అధికారులు, పార్టీ నాయకులు పల్లకిలో ఊరేగిస్తున్నట్లు ఒక కార్టూను పోస్టు చేశారు. కొత్త దేవుడు, కొంగొత్త దేవుడు అని రాస్తూనే దానిపైన హెలిక్యాప్టర్లో సంచుల్లో డబ్బులు తీసుకెళ్లిపోతున్నట్లు ఉంది. అంతే కాకుండా నియంతలతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ రాసుకొచ్చారు. దీంతో జగన్, పవన్ కల్యాణ్ మధ్య రాజకీయ శత్రుత్వం మరింత పెరిగింది.