వాజ్ పేయి ఆదర్శాలు, అద్వానీ రాజకీయాలు ఇప్పుడు బీజేపీలో లేవు. కమలదళంలో ఇప్పుడంతా హైటెక్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆమాటకొస్తే ఏ పార్టీ కూడా తన మూలాలను పట్టించుకుంటున్న దాఖలాలు లేవనుకోండి. కానీ బీజేపీ కూడా ఆ తానులో ముక్కే కావడం ఇప్పుడు విశేషం. సిద్ధాంతాలపై నిలబడ్డ బీజేపీ క్రమక్రమంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కార్పొరేట్లతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగే నేతలు, చివరకు వారినే రాజ్యసభకు పంపించి మరింతగా రాజకీయాలను వ్యాపారంతో కలిపేశారు.

ఇటీవల కాలంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలనుంచి బీజేపీలో చేరుతున్నవారిని గమనిస్తే, అవినీతి మకిలి అంటుకుంటే.. కమలం ఆకర్షించినట్టే అని అర్థమవుతుంది. ఎన్డీఏ రెండోదఫా అధికారం చేపట్టిన తొలినాళ్లలో టీడీపీనుంచి బీజేపీకిలోకి జంప్ చేసిన రాజ్యసభ సభ్యులంతా వ్యాపారవేత్తలే. సుజనా చౌదరి ఏకంగా ఈడీ నోటీసులందుకున్నారు, బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అలాంటి నేతలకు బీజేపీ పునరావాస కేంద్రంగా మారిందనే చెప్పాలి. సరిగ్గా ఇలాంటి బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయిన అప్పటి టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కూడా ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుని పునీతులయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. తాజాగా భూ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ది కూడా ఇదే దారి.

ఈటల రాజేందర్ ని కావాలనే టార్గెట్ చేశారా, లేక టీఆర్ఎస్ లో ఉన్నవారంతా సచ్ఛీలురా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఓ పార్టీ అవినీతి ఆరోపణలో మంత్రి పదవినుంచి తొలగించి, పార్టీనుంచి గెంటేసినంత పని చేసిన నాయకుడ్ని బీజేపీ పిలిచి మరీ కండువా కప్పడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈటల వ్యవహారాన్ని రాజకీయ కుట్రగా భావించినా.. భూకబ్జా ఆరోపణలనుంచి ఆయనింకా చట్టప్రకారం బయటపడలేదు. కేసు నడుస్తోంది. ఈ దశలో ఈటలను పార్టీలో చేర్చుకోవడంపై కొంతమంది స్థానిక బీజేపీ నేతలు కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ నుంచి దూరంగా ఉంటున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా రేపో మాపో.. బీజేపీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు. రఘురామపై కూడా అవినీతి ఆరోపణలున్నాయి. అంటే.. దాదాపుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాచ్ అంతా బీజేపీవైపు చూడటం విశేషం. కేంద్రంలో అధికారంలో ఉండటంతో.. వీరంతా ఆ పార్టీనీడన ఆశ్రయం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన నాయకులు లేకపోవడంతో.. ఎవరొచ్చినా చేర్చుకునేందుకు సై అంటోంది బీజేపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: