ఉక్రెయిన్‌పై యుద్ధం నాలుగు వారాల క్రితం యుద్ధం ప్రారంభించిన రష్యాకు ఇప్పుడు ఆ యుద్ధం ముగించడం ఎలాగో తెలియడం లేదు. భీకరదాడులు చేస్తున్నా ఉక్రెయిన్ మాత్రం లొంగడం లేదు. దేశం సర్వనాశనం అవుతున్నా జెలెన్‌ స్కీ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. అంతే కాదు.. తుది శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటామంటున్నాడు. ఆ దిశగా ఉక్రెయిన్ ప్రజలను కూడా సంసిద్ధులను చేస్తున్నాడు. మరోవైపు  యుద్ధం కొనసాగుతుండటంతో రష్యాపై అంతర్జాతీయ స్థాయిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.


ఉక్రెయిన్‌ తో యుద్ధం ప్రభావం కారణంగా రష్యా ప్రజలు కూడా నానా అగచాట్లు పడుతున్నారు. రష్యాలో ధరలు విపరీతంగా పెరిగాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు పని చేయడం లేదు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఇలా ఇంటా బయటా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒత్తిడితో ఉన్నారు. ఈ ఒత్తిడి కారణంగా పుతిన్‌ ఏదైనా విపరీతమైన నిర్ణయం తీసుకుంటాడా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఊహించని రీతిలో ఉక్రెయిన్‌ సేనలు ప్రతిఘటిస్తుండటం వల్ల పుతిన్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడట.


చివరకు ఈ ఒత్తిడి కారణంగా రష్యా ప్రారంభించిన యుద్ధం.. అణు యుద్ధంగా మారుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఈ కథనాలు ఇస్తున్నాయి. అణ్వాయుధాలకు పని చెప్పే సమయం ఆసన్నమైందని రష్యా భద్రతా విభాగాధిపతి కూడా కామెంట్ చేసినట్టు ఈ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఒకవేళ పుతిన్‌ నిజంగానే  అణు యుద్ధానికి కాలు దువ్వితే అందువల్ల జరిగే పరిణామాలకు కూడా ప్రపంచం సిద్ధంగా ఉండటం అవసరమని ఆ కథనాలు సూచిస్తున్నాయి.


ఇప్పటికే రష్యా కింజల్‌ హైపర్‌ సోనిక్‌ క్షిపణులను రంగంలోకి దించింది. ముందు ముందు అణ్వాయుధాలు కూడా వాడే ప్రమాదం ఉందేమో అన్న భయం పలు దేశాల్లో కనిపిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థలు డెయిలీ మెయిల్‌, మిర్రర్‌ ఇలాంటి ఊహాగానాలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: