
అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీల్లో, సభల్లో పసుపు జెండాలు పట్టుకొని ప్రత్యక్ష మయ్యారు. గత ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓటమికి బీఆర్ఎస్ కూడా ఒక కారణం అని భావించిన టీడీపీ నేతలు.. మరోవైపు రేవంత్ రెడ్డి టీడీపీ పూర్వ నాయకుడు కావడంతో కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేశారు అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే.. టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో బలంగా ఉంది. టీడీపీ సానుభూతి పరులు కాంగ్రెస్ సభల్లో జెండాలతో కనిపించినా చంద్రబాబు నాయుడు కానీ.. పార్టీ ముఖ్యనేతలు కానీ వారిని వద్దని వారించలేదు. మరోవైపు టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన ను కూడా ఓడించడానికి కృషి చేశారు. కాంగ్రెస్ కే తమ మద్దతు అనే ప్రచారాన్ని బాగా తీసుకువచ్చారు.
తీరా చూస్తే ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ అద్వితీయ విజయం సాధించింది. ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో గెలిస్తే తమ గొప్పే అని ప్రచారం చేసుకోవాలనుకున్న చంద్రబాబుకి ఇది పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ లో ఆ పార్టీ ప్రభావం కోల్పోతుందని భావిస్తే గతంలో కన్నా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎక్కువ మెజార్టీలు వచ్చాయి. టీడీపీ నాయకులు సీరియస్ గా తీసుకున్న నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓ రకంగా చెప్పాలంటే టీడీపీ ప్రభావం ఇక తెలంగాణలో లేదు అనే చెప్పవచ్చు.