ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే.. దాదాపు 12 ఏళ్లుగా ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తన ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేయాలని చూస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న కమలనాథులు ఢిల్లీ కోటను దక్కించుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు.  


ఇందుకోసం తమ మాతృ సంస్థ సంఘ్ పరివార్ ను రంగంలోకి దింపిందని చెబుతున్నారు.  మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో తనదైన వ్యూహాలతో బీజేపీకి విజయాన్ని అందించిన సంఘ్ ఢిల్లీలో కాలు మోపడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఊహించిన దెబ్బ తగలడంతో సంఘ్ పరివార్ పూర్తిగా అలర్ట్ అయింది.   మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంలో విఫలమైంది. దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే రంగంలోకి దిగిన సంఘ్ పరివార్ ఆ రెండు రాష్ట్రాల్లో ఓ పథకం ప్రకారం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫలితాలను సమూలంగా మార్చేసింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఢిల్లీపైనా అవే వ్యూహాలను అమలు చేసే దిశగా సంఘ్ పనిచేస్తోందని చెబుతున్నారు.


కేరాఫ్ నాగపూర్ గా ఉన్న సంఘ్‌ పరివార్ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది.  ప్రతి గల్లీ గల్లీని చుట్టేస్తూ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్న పరిస్థితులపై వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.  బీజేపీకి ఎక్కడ పట్టుంది..ఎక్కడ పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయనే దానిపై నివేదికలిస్తూ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంఘ్ పరివార్‌..బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది. హస్తిన మారుమూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ కనీసం 50 వేల సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో 13 వేల వరకు ఎన్నికల బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్‌ స్థాయిలో సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు చిన్న చిన్న గల్లీ మీటింగ్స్‌ పెడుతున్నారు.   డోర్ టు డోర్ ప్రచారం..సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారు. దీంతో హస్తిన రాజకీయం ఆసక్తికరంగా మారింది. హోరాహోరీగా సాగుతున్న పోరులో అంతిమ విజేత ఎవరో వేచిచూడాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: