
ఇటీవల కట్టుదాటుతున్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ విధానాలు తెలుసుకుని పద్దతిగా నడుస్తున్నారని, కానీ కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు తాను 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి వారితో నేరుగా మాట్లాడానని వెల్లడించారు. “గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు ఒకసారి పిలిచి చెప్పుతా. మారకపోతే రెండోసారి చెబుతా. అప్పటికీ మారకపోతే మూడోసారి చెప్పను, నేరుగా కఠిన చర్యలు తీసుకుంటా. అసలు రెండోసారి పిలవాలా వద్దా అన్నది కూడా వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది” అని స్పష్టం చేశారు.
చంద్రబాబు ఇలాంటి హెచ్చరికలు తరచూ చేసినా, ఆచరణలో చూపించకపోవడమే పెద్ద మైనస్ అని టీడీపీ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నలు వస్తున్నాయి. తప్పులు చేస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే నేతలను ఉపేక్షించడం కంటే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మిగిలిన వారిలో కాస్త భయం ఉంటుందని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. మొత్తానికి, చంద్రబాబు మాటల్లో కాకుండా చేతల్లో కఠినతను చూపించాలని కోరే వర్గాలు పెరుగుతున్నాయి.