
షర్మిల ప్రజా సమస్యలపై గళం వినిపించడం కంటే, అన్న జగన్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు పార్టీ లోపల మరియు బయట వినిపిస్తున్నాయి. దీనిపై సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు మౌనం పాటించారు. కొందరు నాయకులు అయితే ఇతర పార్టీలవైపు కూడా వెళ్లిపోయారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పుంజుకోవాల్సిన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ కాలంలో కాంగ్రెస్‌కు ఉన్న పట్టు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజా ఉద్యమాలు, రోడ్ షోలు లేదా ఆందోళనలు లాంటి కార్యాచరణలో షర్మిల ముందడుగు వేయకపోవడం వల్ల ప్రజల్లో ప్రత్యేక స్పందన రాలేదు. ఈ కారణంగా ఆమె వైఎస్ వారసురాలిగా తనదైన ముద్ర వేసుకోలేకపోయారన్న భావన పెరిగిపోతోంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, షర్మిల వాస్తవంగా వైఎస్ వారసత్వాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే, ఇప్పటికి కాంగ్రెస్‌లో కొత్త ఊపు కనిపించేదని చెబుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని, ఇంకా ఇదే తీరులో కొనసాగితే కాంగ్రెస్‌లో ఆమె తప్పా కీలక నేతలు ఎవ్వరూ ఉండే ఛాన్సులు కనపడడం లేదు. ఏదేమైనా షర్మిల ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి, గ్రామీణ స్థాయిలో మళ్లీ కాంగ్రెస్ సౌరభాలు రేపగలిగితేనే ఆమె భవిష్యత్తు నాయకత్వం బలపడుతుంది. లేకపోతే వైఎస్ చరిష్మాను కొనసాగించడంలో విఫలమైన నాయకురాలిగా మిగిలిపోతారన్నది స్పష్టమవుతోంది.